60 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయకపోతే చర్యలే…

60 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయకపోతే చర్యలే…
  •  100 ఫ్లయింగ్ స్క్వాడ్లతోఆకస్మిక తనిఖీలు
  •  పనులు చేపట్టని ప్రజా ప్రతినిధులు, అధికారులపై చర్యలు
  •  డీపీవో, జడ్పీ సీఈవో, ఎంపీడీవోలను భర్తీ చేయాలి
  •  పంచాయతీ రాజ్​ సమీక్షలో సీఎం

హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో వేగంగా పచ్చదనం, పరిశుభ్రత పనులు చేపట్టేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల యాక్షన్ ప్లాన్ ’ అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు.  పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖలపై శనివారం ప్రగతి భవన్ లో ఆయన సుమారు 11 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉన్నతాధికారులు, సర్పంచుల సంఘం ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 60 రోజుల యాక్షన్​ ప్లాన్​లో వారం రోజులు ‘పవర్ వీక్’ ఉంటుందని, ఆ వీక్​లో పూర్తిగా విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. ‘కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చాం. అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఖచ్చితమైన బాధ్యతలు పెట్టాం. ఎవరేం పని చేయాలో నిర్దేశించాం. అవసరమైన అధికారాలిచ్చాం. కావాల్సిన నిధులను బడ్జెట్​లో కేటాయించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పించింది” అని తెలిపారు. కొత్త చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుందని, ఎవరినీ ఉపేక్షించదని స్పష్టం చేశారు.

యాక్షన్​ ప్లాన్​ ముగియగానే ఆకస్మిక తనిఖీలు

అన్ని గ్రామాల్లో ఆరు నెలల్లో విధిగా శ్మశాన వాటికలు(వైకుంఠ ధామం) నిర్మించాలని సీఎం ఆదేశించారు.  యాక్షన్ ప్లాన్ లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలపై ప్లాన్​ పూర్తవగానే ముఖ్య అధికారుల నేతృత్వంలోని 100 ఫ్లయింగ్ స్క్వాడ్ లు  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ఆకస్మిక తనిఖీలు చేపడుతాయని  సీఎం తెలిపారు. ఏ గ్రామంలో అయితే నిర్దేశించిన పనులు జరగలేదో..  అక్కడ సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు.

ఖాళీలు భర్తీ చేయాలి

అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను (డీపీఓ)లను,  ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఒకరు చొప్పున  డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ (డీఎల్పీవో) లను , ప్రతి మండలానికి ఒక మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ)ని నియమించాలని సీఎం ఆదేశించారు.  ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృధ్ది (ఈవోపీఆర్డీ)  అనే పేరును తీసేసి, ఎంపీవోగా మార్చాలన్నారు. ఎంపీడీవో, జడ్పీ సీఈవో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పోస్టులను భర్తీ చేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలన్నారు. శాఖాపరంగానే కొత్త నియామకాలు చేపట్టాలని,  ప్రక్రియ అంతా చాలా వేగంగా జరగాలని అధికారులకు సూచించారు.

60 రోజుల యాక్షన్​ ప్లాన్​లో చేపట్టాల్సిన పనులు:

  •             గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహించాలి. ఎక్కడా చెత్తా చెదారం కనిపించొద్దు.
  •             కూలిపోయిన ఇండ్లు, పశువుల కొట్టాల శిథిలాలను తొలగించాలి. పాడుపడిన బావులను, నీటి బొందలను పూడ్చేయాలి.
  •             గ్రామంలో దోమల మందు పిచికారి చేయాలి.
  •             వైకుంఠధామం (శ్మశాన వాటిక) నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. ప్రతి 2వేల జనాభాకు ఒక శ్మశానం నిర్మించాలి.
  •             డంపింగ్ యార్డుకు, విలేజ్ కమ్యూనిటీ హాల్ కు, విలేజ్ గోదాము కోసం స్థలాలు సేకరించాలి.
  •             ‘ప్లాన్​ యువర్​ విలేజ్’​ పేరిట గ్రామానికి కావాల్సిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి.
  •             గ్రామంలో వందకు వందశాతం పన్నులు వసూలు చేయాలి. ఇది గ్రామ కార్యదర్శి బాధ్యత.
  •             వివాహ రిజిస్ట్రేషన్ నిర్వహించాలి. జనన, మరణాలను రికార్డుల్లో తప్పక చేర్చాలి.
  •             విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లించాలి.
  •             శ్రమదానానికి ప్రోత్సహించాలి.
  •             విలేజ్ నర్సరీ ఏర్పాటు చేయాలి. విరివిగా మొక్కలు నాటి రక్షించాలి.

పవర్ వీక్ లో చేయాల్సిన పనులు

  •             ఏడు రోజుల పాటు పూర్తిగా విద్యుత్ సంబంధమైన సమస్యలను పరిష్కరించాలి.
  •             గ్రామంలో వీధిలైట్ల కోసం ఎంత కరెంటు వాడుతున్నారో ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. వంగిపోయిన స్తంభాలను సరిచేయాలి.