ముందు చట్టం చేయండి : గంగుల కమలాకర్

ముందు చట్టం చేయండి : గంగుల కమలాకర్
  •  ఆ తర్వాతే కులగణనచేపట్టండి 

హైదరాబాద్, వెలుగు: కులగణనపై మూడు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, న్యాయపరమైన చిక్కులు వచ్చాయని బీఆర్ఎస్​ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ​అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాంటి ఇబ్బందులు రాకుండా ముందు చట్టబద్ధత కల్పించాలని కోరారు. శుక్రవారం అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ సందర్భంగా గంగుల మాట్లాడారు. చట్టం చేసిన తర్వాతే కులగణన చేపట్టాలని కోరారు. ‘‘ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తామంటున్నారు. 

మరి డేటా ప్రైవసీ మాటేంటి? బీసీల్లో సబ్ కులాల వారీగా వివరాలు వెల్లడిస్తారా? లేదంటే కేవలం బీసీలుగానే లెక్కలు తీస్తారా? కులగణన నిర్వహణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. బీసీ కమిషన్ ద్వారానా లేదంటే జ్యుడీషియల్​కమిషన్​ఏర్పాటు చేసి కులగణన చేస్తారా?’’ అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే కులగణన చేయాలని, టైమ్ లిమిట్​పెట్టుకుని పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు. సర్వేకు నిధులు ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో ప్రకటించిన హామీలనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచి, లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేయాలని కోరారు. 

బిల్లు పెట్టండి: కేటీఆర్​ 

సభను పొడిగించి కులగణన బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్​డిమాండ్​చేశారు. చట్టబద్ధత ఉంటేనే కులగణనకు విలువ ఉంటుందన్నారు. బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పార్టీలకతీతంగా ఎమ్మెల్యేల్లో ఆవేదన వ్యక్తమవుతున్నదన్నారు. బీహార్​లో రూ.500 కోట్లతో కులగణన చేసినప్పటికీ, న్యాయపరమైన చిక్కుల వల్ల అది కాస్తా త్రిశంకు స్వర్గంలో ఉండిపోయిందన్నారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేదని, ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపినా మోదీ ప్రభుత్వం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని విమర్శించారు.