13 లక్షల ఎకరాల్లో.. డేంజరస్ కాటన్

13 లక్షల ఎకరాల్లో.. డేంజరస్ కాటన్

రాష్ట్రంలో అనుమతి లేని బీజీ 3 పత్తి సాగు

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో అనుమతి లేని ప్రమాదకర హెచ్‌‌టీ (హెర్బిసైడ్ టాలెరెంట్, బీజీ 3‌‌​) పత్తి సాగవుతోంది. ఈ సీజన్​లో ఇప్పటిదాకా 407 కాటన్ సీడ్ శాంపిల్స్ తీస్తే 154 పాజిటివ్​గా వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. రాష్ట్రంలో 48.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగైతే.. అందులో దాదాపు 13 లక్షల ఎకరాల్లో బీజీ 3 ఉంటుందని అంచనా వేస్తున్నరు. టాస్క్​ఫోర్స్ చేస్తున్న దాడుల్లో కొంత సీడ్ పట్టుబడినా.. అక్రమార్కులు దొడ్డిదారిన రైతుల‌‌కు అంటగట్టారని చెబుతున్నారు. ఈ విత్తనాలు వేస్తే కలుపు రాదని, కూలీల బాధ తప్పుతుందని చెబుతూ కొన్ని ప్రైవేటు విత్తన కంపెనీలు అక్రమంగా రైతులతో సాగు చేయిస్తున్నాయని పేర్కొంటున్నారు.
విచ్చలవిడిగా అమ్మకాలు
హెచ్‌‌టీ జీన్ ఉన్న ప‌‌త్తి విత్తనాల సాగు, అమ్మకాలకు ఇండియాతోపాటు చాలా దేశాల్లో అనుమతి లేదు. ఈ పత్తి సాగు చేస్తే ప్రమాదకరమైన గ్లైఫోసేట్ స్ప్రే చేయాలి. ఈ రెండింటిపై నిషేధం ఉన్నా మార్కెట్​లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతో ఎన్విరాన్​మెంట్​కు ప్రమాదం ఏర్పడుతోంది. జనాలకు, రైతులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే హెచ్చరించింది. కేంద్రం కూడా బీజీ 3 పత్తి విత్తనాలపై అలర్ట్​గా ఉండాలని రాష్ట్రాన్ని చాలా సార్లు హెచ్చరించింది. హెచ్‌‌టీ కాటన్‌‌‌‌పై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ప‌‌లు సూచ‌‌న‌‌లు చేసింది. రైతులను ఆర్గనైజ్ చేసి కంపెనీలు ఈ విత్తనాలను అంటగడుతున్నాయని, సాగు చేయకుండా అడ్డుకోవాలని సూచించింది. బీజీ3 విత్తనాలు మ‌‌హారాష్ట్ర, గుజ‌‌రాత్ నుంచి రాష్ట్రానికి వస్తున్నాయని, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని హెచ్​టీ సాగుపై కఠినంగా ఉండాలని స్పష్టం చేసింది.
సాగు చేస్తే చాలా నష్టం
కలుపు రాదంటూ అంటగడుతున్న బీజీ 3 పత్తి విత్తనాలు సాగు చేస్తే భవిష్యత్​లో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అగ్రికల్చర్ ఎక్స్​పర్టులు చెప్తున్నారు. కానీ ఏ రకమైన సీడ్స్ వేస్తున్నారో తెలియ‌‌కుండానే రైతులు బీజీ 3 ప‌‌త్తి సాగు చేస్తున్నట్లు తెలిసింది. బీజీ 3 సీడ్స్ వేస్తే క‌‌లుపు రాకుండా ఉండేందుకు క్యాన‌‌ర్ కార‌‌క‌‌మైన డేంజ‌‌ర‌‌స్ గ్లైఫోసేట్ ర‌‌సాయానాన్ని పొలంలో కొట్టాల్సిందే. ఫ‌‌లితంగా భూసారం దెబ్బతిన‌‌డంతోపాటు రైతులు అనారోగ్యానికి గుర‌‌వుతున్నారు. ఆ కాటన్ ఉత్పత్తులను వాడుతున్న వారు కూడా రోగాల బారిన ప‌‌డుతున్నారు. 
నాలుగేళ్లలో ఈసారే అధికం
జిల్లాల వారీగా టాస్క్‌‌ఫోర్స్‌‌, పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నా బీజీ 3 విత్తనాలను వ్యవసాయ అధికారులు అడ్డుకోలేక‌‌పోతున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నాగ‌‌ర్ క‌‌ర్నూల్‌‌, గద్వాల, వనపర్తి, భ‌‌ద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీజీ 3 దందా జోరుగా సాగుతోంది. 2017లో 368 విత్తన శాంపిళ్లతో పాటు ఆకుల‌‌ను టెస్టు చేయగా.. అందులో 81 పాజిటివ్‌‌గా తేలాయి. 2018లో 725 విత్తన శాంపిళ్లను పరీక్షించగా 119 పాజిటివ్‌‌గా గుర్తించారు. 2019లో 589 శాంపిళ్లు సేకరించగా.. ఇందులో 72 పాజిటివ్‌‌గా వచ్చాయి. పోయినేడు624 శాంపిళ్లను టెస్ట్ చేస్తే 138 హెచ్‌‌టీ విత్తనాలుగా బ‌‌య‌‌ట‌‌ప‌‌డ్డాయి. ఈసారి 407 శాంపిల్స్​లోనే 154 పాజిటివ్ వచ్చాయి. ఈ నాలుగేళ్లలో ఇంత స్థాయిలో పాజిటివ్ రావడం ఇప్పుడే.
ప్రైవేటు కంపెనీలకు అధికారుల సహకారం
కొన్ని బడా కంపెనీలు అప్రూవ్ చేయని బీజీ3 సీడ్​ను కావాలనే ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి కొందరు అధికారులు సహకరిస్తుండటంతో ఈ విత్తనాలు పొలాలకు చేరుతున్నాయి. ఈ విష బీజీ 3 విత్తనాల సాగు మంచిది కాదని చెబుతూ కనీస ప్రచారం కూడా చేయడం లేదు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గ్లైఫోసేట్ మందును గ‌‌తేడాది ఏకంగా 2,875 లీట‌‌ర్లను అధికారులు సీజ్ చేశారు. ఈ ఏడాదిలోనూ వెయ్యి లీటర్లు పట్టుబడినట్లు చెబుతున్నారు.

సర్కార్ నిర్లక్ష్యం వల్లే
క్యాన‌‌ర్స్‌‌కు కార‌‌క‌‌మైన హెచ్‌‌టీ విత్తనాలు, గ్లైఫోసేట్ కెమిక‌‌ల్‌‌పై త‌‌నిఖీలను కొంత వ‌‌ర‌‌కే ప‌‌రిమితం చేస్తున్నారు. జెనెటిక్ అప్రూవ‌‌ల్ క‌‌మిటీ అనుమ‌‌తి లేకుండా బ‌‌యోడైవ‌‌ర్సిటీని దెబ్బతిసే విత్తనాల‌‌ను సాగుచేస్తే ఎన్విరాన్‌‌మెంట‌‌ల్ ప్రొటెక్షన్ 1986 యాక్ట్ ను అమ‌‌లు చేయాలి. దీనిని అధికారులు, రాష్ట్ర స‌‌ర్కార్ పట్టించుకోవట్లేదు.                  - దొంతి న‌‌ర్సింహారెడ్డి, ఎక్స్‌‌ప‌‌ర్ట్‌‌