TSPSC Paper Leak: 2021లో టీఎస్పీఎస్సీలో అర్హత లేని వారిని నియమించిన్రు : రేవంత్ రెడ్డి

TSPSC Paper Leak: 2021లో టీఎస్పీఎస్సీలో అర్హత లేని వారిని నియమించిన్రు : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని 50 లక్షల విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో విద్యార్థి సంఘాలు నిరసనకు పిలుపునిస్తే వారిని అడ్డుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తోందని చెప్పారు. నిర్భందాలు ఈ ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారని, ఆ నిరసనకు వెళ్దామనుకునే లోపే తనను హౌజ్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తన చుట్టుపక్కల రాకపోకలను నియంత్రించారని చెప్పారు. ఈ అక్రమ నిర్భందం దుర్మార్గమని, అటవిక చర్య అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.

2021లో టీఎస్పీఎస్సీలో అర్హత లేని వారిని నియమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై హైకోర్టు జడ్జి సైతం ఆశ్చర్యపోయారని చెప్పారు. 2021లో దీనిపై పిటిషన్ వేస్తే.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఆరోపించారు. నియామకంలోనే లోపాలున్నాయని ఆయన విమర్శించారు. అనర్హులను నియమించడం వల్లే తప్పిదం జరిగిందని స్పష్టం చేశారు.