ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని దారుణం

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని దారుణం
  • హత్య అనంతరం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు
  • సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయిలో ఘటన

నారాయణ్‌‌‌‌‌‌‌‌ఖేడ్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. పది రోజుల కింద సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయి గ్రామంలో జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

డీఎస్పీ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నారాయణఖేడ్‌‌‌‌‌‌‌‌ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన చెంబనుళ్ల ముత్యంరెడ్డి (35) బోరు మోటర్లు రిపేర్ చేస్తుంటాడు. అతడి భార్య కల్పన నారాయణఖేడ్‌‌‌‌‌‌‌‌లోని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తోంది. కల్పనకు మనూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన, నారాయణఖేడ్‌‌‌‌‌‌‌‌ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌‌‌‌‌‌‌‌గా పనిచేసే గౌని పండరితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న ముత్యంరెడ్డిని చంపేయాలని కల్పన, పండరి నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో పది రోజుల కింద ఇద్దరూ కలిసి గంగాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామంలోనే ముత్యంరెడ్డి కాళ్లు, చేతులు కట్టేసి ఉరి వేసి హత్య చేశారు. అనంతరం డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని ఎల్గోయి గ్రామానికి తీసుకెళ్లి పండరికి చెందిన వ్యవసాయ పొలంలోనే జేసీబీతో గుంత తీసి పూడ్చివేశారు. తర్వాతి రోజు కల్పన తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

అయితే కల్పన ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. పండరితో కలిసి తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆదివారం ఎల్గోయి గ్రామానికి వెళ్లి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని బయటకు తీశారు. ఘటనాస్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎస్సై కోటేశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించారు.