- కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్తగా ఏర్పడిన బీజేపీ పాలకవర్గం అవినీతి, అక్రమాలకు పాల్పడితే తాము వదిలిపెట్టమని, ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన కార్పొరేటర్‌ను మేయర్‌గా, గతంలో మేయర్‌గా పని చేస్తున్న వ్యక్తిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవడంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలకవర్గం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని, గత బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు.
గతంలో సునీల్ రావు అవినీతిపరుడని అనేకసార్లు విమర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. ఆ తర్వాత అతడిని పార్టీలో చేర్చుకున్నారన్నారు. నాడు విమర్శించి నేడు మళ్లీ డిప్యూటీ మేయర్‌గా ఎంపిక చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కార్పొరేషన్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కరీంనగర్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆకుల నర్మద, భాస్కర్ నాయక్, గుమ్మడి రాజకుమార్, ఆకుల నందిని, పడిశెట్టి వసంత లక్ష్మి, కల్లేపల్లి శారద, సికిందర్ ఇక్రమ్, తదితరులు పాల్గొన్నారు.
