చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్​లో.. పోలింగ్ కంప్లీట్

చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్​లో.. పోలింగ్ కంప్లీట్

చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ శుక్రవారం ముగిసింది. మధ్యప్రదేశ్​లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 76 శాతం పోలింగ్ నమోదైంది. మోరెనా జిల్లా డిమాని అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకున్నారు. రాజ్ నగర్ లో బీజేపీ లీడర్ల కార్లను దుండగులు ధ్వంసం చేశారు. మోవ్ సెగ్మెంట్ లో రెండు పార్టీల కార్యకర్తలు కత్తులతో దాడి చేసుకోగా, నలుగురికి గాయాలయ్యాయి. ఇక చత్తీస్​గఢ్​లో సెకండ్ ఫేజ్​లో భాగంగా 70 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70.59% పోలింగ్ నమోదైంది. సంజారి- బాలోద్​ నియోజక వర్గంలో అత్యధికంగా 84.07 శాతం పోలింగ్ రికార్డయింది. రాయగఢ్ జిల్లాలోని తెంతగుడ్డి, మాణిక్​పూర్ దెహ్న్కాలో ఓటర్లు పోలింగ్​ను బహిష్కరించారు. గరియాబంద్‌‌లో నక్సలైట్లు జరిపిన ఐఈడీ బ్లాస్ట్​లో ఐటీబీపీ జవాన్ చనిపోయాడు. 

భోపాల్: మధ్యప్రదేశ్​లోని 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 71% పోలింగ్ నమోదైంది. పొద్దున 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో మాత్రం 3 గంటలకే ముగిసింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సెహోర్​లో ఓటేశారు. రేహ్తిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తన భార్యతో కలిసి భోపాల్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

లోక్​సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇండోర్​లో, మాజీ సీఎం ఉమా భారతి తికమ్​గఢ్​లో ఓటేశారు. కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, ఫగ్గన్ సింగ్ కులస్తే, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ వీడీ శర్మ, జనరల్ సెక్రటరీ కైలాశ్​విజయ్​వర్గియా ఓటేశారు. మొత్తం 2,533 మంది బరిలో ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా 64,626 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 

ఒకరిపై ఒకరు కత్తులు, రాళ్లతో దాడులు

మోరెనా జిల్లా డిమాని అసెంబ్లీ సెగ్మెంట్​లోని 147, 148 పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇండోర్‌‌‌‌‌‌‌‌లోని మోవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో నలుగురు గాయపడ్డారు. రాజ్​నగర్ అసెంబ్లీ సెగ్మెంట్​లో బీజేపీ లీడర్ల కార్లను దుండగులు ధ్వంసం చేశారు. భిండ్ జిల్లా మెహగావ్ సెగ్మెంట్​లోని మనహడ్ గ్రామంలో జరిగిన రాళ్ల దాడిలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. చింద్వారా సెగ్మెంట్​లోని బరారీపురా పోలింగ్ బూత్​లో వెళ్తున్న మాజీ సీఎం కమల్​నాథ్ కొడుకు నకుల్ నాథ్​ను బీజేపీ లీడర్లు అడ్డుకున్నారు. ఖార్గోన్​లో ఓటేసేందుకు వచ్చిన 53 ఏండ్ల మహిళ హార్ట్ ఎటాక్​తో చనిపోయింది. 

చత్తీస్​గఢ్​లో జవాన్ మృతి

చత్తీస్​గఢ్​లో సెకండ్ ఫేజ్​లో 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 67.48% పోలింగ్ నమోదైంది. ధమ్​తారి జిల్లాలో అత్యధికంగా 79.89% పోలింగ్ రికార్డైంది. రాయగఢ్ జిల్లాలోని తెంతగుడ్డి, మాణిక్​పూర్ దెహ్న్కాలో ఓటర్లు పోలింగ్​ను బహిష్కరించారు. గరియాబంద్‌‌‌‌‌‌‌‌లో నక్సలైట్లు జరిపిన  ఐఈడీ బ్లాస్ట్​లో ఐటీబీపీ జవాన్ చనిపోయాడు.

స్మార్ట్ పోలింగ్ స్టేషన్​

నందనగర్​లో మా కనకేశ్వరి దేవి కాలేజీలో ‘స్మార్ట్’ పోలింగ్ స్టేషన్​ను ఏర్పాటు చేశారు. ఏఐ​తో సేవలు అందించారు. క్యూలో నిలబడే అవసరం లేకుండా బార్ కోడ్​తో కూడిన టోకెన్ సిస్టమ్ ఏర్పాటుచేశారు. ఓటేసేందుకు వచ్చినవాళ్లు ముందు టోకెన్ తీసుకున్నారు. తమ నంబర్ వచ్చేదాకా పోలింగ్ స్టేషన్​లోనే కూర్చున్నారు. ఓటేసి బయటికొచ్చే ముందు ఏఐ బేస్డ్ కెమెరా ముందు నిల్చున్నారు. ఓటేసిన వేలు చూపిస్తే కెమెరా ఫొటో తీసుకుంది. వెంటనే స్క్రీన్ మీద వచ్చిన బార్ కోడ్​ను ఫోన్​తో స్కాన్ చేస్తే ఆ ఫొటో ఓటర్ మొబైల్​కు ట్రాన్స్ ఫర్ అయింది. ఆ ఫొటోను చాలా మంది సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు.