జోషిమఠ్ బాధితులకు కాంపెన్సేషన్ మార్కెట్ రేట్ ప్రకారమే ఇస్తం

జోషిమఠ్ బాధితులకు కాంపెన్సేషన్ మార్కెట్ రేట్ ప్రకారమే ఇస్తం
  • తక్షణ సాయం కింద రూ. 1.5 లక్షలు ప్రకటించిన ఉత్తరాఖండ్ సీఎం 
  • రెండు హోటళ్ల నే కూలుస్తామన్న సీఎం సెక్రటరీ  

జోషిమఠ్: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోవడం వల్ల దెబ్బ తిన్న ఇండ్లను ఖాళీ చేస్తున్న కుటుంబాలకు మార్కెట్ రేట్ ప్రకారమే నష్ట పరిహారం చెల్లిస్తామని బుధవారం ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. వివిధ వర్గాలను సంప్రదించిన తర్వాత మార్కెట్ రేట్​ను నిర్ణయిస్తామని వెల్లడించారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబాలకు రూ. 1.5 లక్షల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. అద్దె ఇండ్లలోకి మారే కుటుంబాలకు ఆరు నెలల పాటు నెలకు రూ. 4 వేల చొప్పున కూడా ఇస్తామన్నారు. కూల్చివేతల భయంతో స్థానికులు మంగళవారం రాత్రంతా తమ బిల్డింగ్​ల ముందే చలిలో కాపుకాశారు. సీఎం ప్రకటనతో స్థానికులకు కొంచెం ఊరట లభించినట్లయింది. 

131 బిల్డింగ్ లు అన్ సేఫ్​ 

జోషిమఠ్ పట్టణంలో మొత్తం 723 బిల్డింగ్​లకు బీటలు వచ్చాయని, ప్రస్తుతానికి రెండు హోటల్స్ ను తప్ప ఇతర బిల్డింగ్​లను కూల్చివేయడంలేదని సీఎం సెక్రటరీ మీనాక్షి సుందరం తెలిపారు. మొత్తం 131 బిల్డింగ్ లను అన్ సేఫ్​గా గుర్తించి మార్కింగ్ చేశామని, వీటిలోని ఫ్యామిలీలనే సేఫ్ ప్లేస్ లకు తరలిస్తున్నామని చెప్పారు. పట్టణంలో ఈ నెల 7 తర్వాత ఇండ్లకు కొత్తగా బీటలు రాలేదని, ఉన్న బీటలు కూడా పెద్దవి కాలేదన్నారు.      

అర్ధరాత్రి యథేచ్ఛగా స్టోన్ క్రషింగ్ 

జోషిమఠ్, పరిసర ప్రాంతాల్లో కన్ స్ట్రక్షన్, డ్రిల్లింగ్ వంటి పనులపై ప్రభుత్వం నిషేధం విధించినా.. బద్రీనాథ్​కు వెళ్లే హైవే వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత యథేచ్ఛగా పనులు జరిగాయి. ఓ కంపెనీకి చెందిన సిబ్బంది స్టోన్ క్రషింగ్ మెషీన్లు, డ్రిల్లింగ్, క్రేన్​లతో యధావిధిగా పనులు చేపట్టడాన్ని నేషనల్ మీడియా బయటపెట్టింది.