
అమెరికాలోని నసావు కౌంటీలో మంగళవారం (ఆగస్టు 15న) మధ్యాహ్నం ఓ మహిళ రోడ్డుపై గన్ తో హల్ చల్ చేసింది. బెల్‌మోర్, జెరూసలేం అవెన్యూ జంక్షన్ వద్ద తన చేతిలోని గన్ ను గురిపెట్టి అక్కడి వారిని భయపెట్టింది. తుపాకీని గాల్లోకి కూడా పేల్చింది. దీంతో పలు వాహనాల్లో ఉన్న పిల్లలు, పెద్దలు భయాందోళన చెందారు. ఇది చూసిన కొందరు వాహనదారులు భయంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులను చూసిన సదరు యువతి.. చేతిలో ఉన్న గన్ ను తన తలకు గురిపెట్టుకుంది. వెంటనే యువతిని ముందుగా తమ వాహనంతో ఢీకొట్టారు పోలీసులు. ఆమె చేతిలో ఉన్న గన్ కిందపడింది. దాన్ని తీసుకునే లోపే పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఆ మహిళ స్వల్పంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణనష్టం జరగకుండా చూసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.