దొంగలను పట్టుకునే క్రమంలో ... పోలీసుల కాల్పులు

దొంగలను పట్టుకునే క్రమంలో ... పోలీసుల కాల్పులు

పిట్లం, వెలుగు : కామారెడ్డి జిల్లా మద్నూర్​మండలంలో సోమవారం రాత్రి పశువుల దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆవులను దొంగిలించి మినీ లారీలో పారిపోతుండగా పోలీసులు 50 కిలోమీటర్లు వెంబడించారు. దీంతో పోలీసులపై రాడ్లు, రాళ్లతో దాడికి యత్నించగా వారిని అదుపు చేయడానికి ఎస్సై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. నిందితులు మహారాష్ట్రలోకి పారిపోగా అక్కడి పోలీసుల సాయంతో లారీని, ఏడుగురు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. ఆ వివరాలను మంగళవారం ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి తెలియజేశారు. ఈ నెల 25న పెద్ద ఎక్లారాలో ఓ ఆవు చోరీ కాగా మద్నూర్​ పోలీస్టేషన్​లో కేసునమోదైంది. అదేరోజు జుక్కల్​పరిధిలో కూడా రెండు ఆవులను ఎత్తుకెళ్లారు. జుక్కల్, మద్నూర్​ ఎస్సైలు బాల్​రెడ్డి, శివకుమార్​సీసీ కెమెరాలను పరిశీలించగా అనుమానాస్పదంగా ఉన్న టాటా టెంపో లారీని గుర్తించారు. ఆ లారీని పట్టుకోవడానికి బిచ్కుంద సీఐ కృష్ణ ఆధ్వర్యంలో  రెండు బృందాలను ఏర్పాటు చేశారు. 

పెట్రోలింగ్ ​చేస్తుండగా...

సోమవారం అర్ధరాత్రి పెట్రోలింగ్​చేస్తూ సోనాల రోడ్​ ఫ్లై ఓవర్​బ్రిడ్జి దగ్గరికి వెళ్లగా అనుమానాస్పదంగా టాటా టెంపో లారీ కనిపించింది. దాన్ని చెక్​ చేయడానికి వెళ్లిన  కానిస్టేబుల్​విఠల్​, హెడ్​కానిస్టేబుల్​శంకర్​లపై నిందితులు రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పెట్రోలింగ్​వాహనం అద్దం పగిలిపోయింది. నిందితులు లారీతో సహా పెద్ద తడ్గూర్​ వైపు పారిపోవడంతో ఎస్సై శివకుమార్​కు సమాచారం ఇచ్చి లారీని వెంబడించారు. ఎస్సై శివకుమార్​ బిచ్కుంద పోలీసులకు సమాచారం ఇచ్చి పెట్రోలింగ్​వాహనంతో కలిసి పది కిలోమీటర్లు వెంబడించారు. నిందితులు పెద్ద తడ్గూర్​చౌరస్తాలో లారీని ఆపి వెనుక వస్తున్న పోలీసు వాహనంపై పైకి ఒక్కసారిగా వచ్చి ఢీకొట్టారు. దీంతో ఎస్సై శివకుమార్​సర్వీసు పిస్తోల్​తో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. భయపడిన వారు లారీని మహారాష్ట్ర దెగ్లూర్​ వైపు మళ్లించారు. ఎస్సై ఈ విషయాన్ని దెగ్లూర్​, మరికెల్​ పోలీసులకు చెప్పి వారిని వెంబడిస్తూ  వెళ్లారు. కారేగాం వద్ద మరోసారి పోలీసు పెట్రోలింగ్​ వాహనాన్ని ఢీకొట్టడంతో వారి వాహనం నిలిచిపోయింది. ఇంతలో మరో వాహనం దొరకబట్టుకుని వెంబడించారు. మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయగా వారు రోడ్డుపై అడ్డంగా రాళ్లు, కర్రలు అడ్డు పెట్టారు. అయినా వారు తప్పించుకుని హనేగాం వైపు వెళ్లారు. అక్కడి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు రెండు కంటెయినర్లను రోడ్డుకు అడ్డం పెట్టడంతో తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. అయినా లారీతో మరికెల్​ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి పారిపోయేందుకు ట్రై చేశారు. పోలీసులు పట్టు వదలకుండా లారీతో పాటు అర్షద్​ అనే నిందితుడిని, ఆవును పట్టుకున్నారు. ఇనుప రాడ్లు, రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా తాము మొత్తం ఏడుగురం ఉన్నామని ఆంగీకరించాడని ఎస్పీ తెలిపారు. వీరి నాయకుడు షబ్బీర్​అని, జావేద్, హంజద్​, ఆబేద్, ఇస్రాయిల్, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు చెప్పారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన మద్నూర్​ఎస్సై శివకుమార్, పెట్రోలింగ్ సిబ్బంది విఠల్​,శంకర్​లను ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి అభినందించి రూ. పది వేల నగదు పురస్కారం అందజేశారు. బిచ్కుంద సీఐ కృష్ణ, ఎస్సై శ్రీధర్​రెడ్డి ఉన్నారు.