సింగరేణి స్థలాల్లో ఇండ్ల పట్టాలు అందడంలే

సింగరేణి స్థలాల్లో ఇండ్ల పట్టాలు అందడంలే

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న వారికి ఏళ్లతరబడి పట్టాలు అందడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆరుసార్లు ఇళ్ల స్థలాల జారీ కోసం జీవోలు జారీచేసినా ఫలితం లేకుండా పోయింది. 

సీఎం హామీ నెరవేరలేదు...

బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో 2018 డిసెంబర్ లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజల ఆకాంక్ష నేరవేరుతుందని, టీఆర్ఎస్ కు ఓట్లు వేసి గెలిపిస్తే రెండు నెలల్లోనే తానే స్వయంగా ఇంటింటికి వచ్చి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కేవలం 50 మందికే పట్టాలు అందాయి. ఇంకా వేలాది మంది పట్టాల కోసం నిరీక్షిస్తున్నారు.

జీవోలు జారీచేస్తున్రు.. విస్మరిస్తున్రు..

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అధికారింగా 17 వేల ఇండ్లు ఉన్నాయి. దాదాపు మూడు వేల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నవారు వేలాది మంది ఉన్నారు. ఆయా ప్రభుత్వాలు 1995లో జీవో ఎంఎస్ నంబర్  972 , 1998లో జీవో 1601, 1999 లో జీవో 539 నంబర్లు జారీచేశాయి.అప్పుడు 2,952 మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1999– 2000 లో జీవో ఎంఎస్ నంబర్ 508 ను జారీ అయ్యింది. అప్పుడు 1,651 మంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. 2014 లో జీవో ఎంఎస్ నంబర్ 58ని జారీ కాగా..2,604 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం మరో జీవో నంబర్ 76 ను జారీ చేసింది. ఇప్పుడు దాదాపు నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ సింగరేణి స్థలంలో ఇండ్లు కట్టుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.

ఎన్నికల కోసమేనా?

ఎప్పుడైనా ఎన్నికలకు ముందే పట్టాల జారీ కోసం జీవోలు జారీ చేయడం... సర్వేలు చేయడం తప్ప ఒక్క పట్టా ఇచ్చింది లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. రామగుండం ఏరిమాలోని గోదావరిఖనిలో 2009లో జీవో  508 జారీ చేసి 17 వేల ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చారు. అంతకు ముందు 2005 లో జీ వో 373 జారీచేసి ఉమ్మడి ప్రభుత్వం కొత్తగూడెంలో 10 వేల మందికి పట్టాలిచ్చారు. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టాలు అందజేశారు. కానీ.. బెల్లంపల్లి లో ఐదు దశాబ్దాలు గా పట్టాల సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దుర్గం చిన్నయ్య ఇండ్ల స్థలాల పట్టాల విషయం పట్టించుకోలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల టైం వచ్చినట్లుంది.. అందుకోసమే మళ్లీ సర్వే అంటూ ఆఫీసర్లు హడావుడి చేస్తున్నారని పేర్కొంటున్నారు. కానీ.. ఇండ్ల పట్టాలు మాత్రం ఆశ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎమ్మెల్యే అసమర్థత వల్లే...

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అసమర్థత కారణంగానే పట్టాలు అందడంలేదు. ఎమ్మెల్యే మాటను సీఎం పట్టించు కోవడంలేదు. ఎమ్మెల్యేకు భూ కబ్జాలకే టైం సరిపోతలేదు. ప్రజల సమస్యలు ఎప్పుడు పట్టించుకోవాలే? ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇవ్వాలి. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం.

- కొయ్యల ఏమాజి, బీజేపీ లీడర్​