జియాగూడ మేకల మండి క్లోజ్... మూసీ కాలుష్యంపై ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ యాక్షన్

జియాగూడ మేకల మండి క్లోజ్... మూసీ కాలుష్యంపై ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ యాక్షన్
  • ఇల్లీగల్ ​గా​ నడుస్తుండడంతో చర్యలు

మెహిదీపట్నం, వెలుగు: జియాగూడలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మేకల మండిని జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు మూసివేయించారు. గతంలోనే టీడీపీ ప్రభుత్వం ఈ మండిని చెంగిచెర్లలోని ఆధునిక వధశాలకు తరలించింది. దీంతో జియాగూడ మండిపై ఆధారపడ్డ సుమారు 3 వేల కుటుంబాలు నాడు ఆందోళనకు దిగాయి. నాటి నుంచి పాత మండి వెనుక ఉన్న 100 ఫీట్ల బైపాస్ రోడ్డు, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇల్లీగల్ గా మండి కొనసాగుతోంది. 

అయితే, జీవాల వ్యర్థాలతోపాటు రక్తం, చనిపోయిన మేకలను నేరుగా మూసీ నదిలోకి వదులుతుండటంతో నది కలుషితమవుతోందని నాలుగు రోజుల కింద ట్విటర్ (ఎక్స్) ద్వారా ఫిర్యాదులు రావడంతో అధికారుల స్పందించారు. చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ నేతృత్వంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి. రామకృష్ణారావు, ఎన్ఫోర్స్​మెంట్ టీమ్ కలిసి ఆ ప్రాంతాన్ని శుక్రవారం తనిఖీ చేశారు.

మండిని, పరిసరాల్లోని మినీ స్లాటర్ హౌస్​లను మూసివేయించారు. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి ఉన్న క్రయవిక్రయాలు మాత్రమే అలాగే కొనసాగుతున్నాయి. కాగా, జియాగూడ స్లాటర్ హౌస్ ఆధునికీకరణకు నిధులు మంజూరై టెండర్లు కూడా ఖరారైన నేపథ్యంలో త్వరగా పనులు పూర్తి చేసి ఇక్కడ ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.