- ఆయనే తేదీ ఫిక్స్చేసి.. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నడిపిస్తం
- మూడేండ్లలోనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన్రు
- రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన్రు.. ఇది ఆర్థిక విధ్వంసం
- కాళేశ్వరం వల్ల చుక్క నీళ్లు రాలే.. కొత్త ఆయకట్టు తేలే
- ప్రాజెక్టుకు తెచ్చిన అప్పుల్లో రూ.33,574 కోట్లు మేం తిరిగి కట్టినం
- కేటీఆర్.. మీ నాయిన అవినీతికే ప్రాజెక్టు బలైపోయింది
- రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులైతే.. కేసీఆర్‌కు లక్ష కోట్ల ఆస్తులు ఎట్ల వచ్చినయని ప్రశ్న
- ప్రజాభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధులకు
- పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వాళ్లు అడిగినట్టే కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లకు అప్పగిస్తామని, ఇందుకోసం అసెంబ్లీ
పెట్టుమని స్పీకర్‌కు కేసీఆర్ లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో వాస్తవాలన్నీ చర్చిద్దామని, ఎందుకు అప్పజెప్పాలో చెప్తే ప్రాజెక్టును వారం రోజులు కాదు.. మూడేండ్లు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీకో లేదా ఇతర సంస్థలకో కాదు.. కేసీఆర్‌కే అప్పగిస్తామన్నారు.
హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్‌గా చేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టులో లోపాలు, ప్రమాదంలో కూలిపోయిన తీరు.. తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు మంగళవారం ప్రజాభవన్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ నిజంగా తప్పు చేయకపోతే.. స్పీకర్‌కు లేఖ రాసి అసెంబ్లీ సమావేశాల తేదీ చెప్పాలన్నారు.
ఆయన కోరుకున్నన్ని రోజులు సభ నడిపిస్తామని తెలిపారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా సభను సజావుగా సాగేలా చూసుకునే బాధ్యత తమదేనని చెప్పారు. జాయింట్ సెషన్ పెట్టి కూలంకషంగా చర్చిస్తామన్నారు. ఈ విషయంలో ఎక్స్‌పర్ట్స్, అడ్వొకేట్ జనరల్‌నూ అసెంబ్లీలోకి పిలిచి చర్చిద్దామని తెలిపారు. కేసీఆర్ చేసిన తప్పుల వల్ల ప్రజలకు శిక్ష పడకూడదని పేర్కొన్నారు. ‘‘మీరు కట్టుకున్న ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా వాడుతున్నట్లే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిజంగా వాడుకునేలా ఉంటే వాడుకునేటోళ్లం కదా ?’’ అని క్లారిటీ ఇచ్చారు.
వాళ్లు ఆర్థిక ఉగ్రవాదులు
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలే వస్తలేవని, వరదలూ రావట్లేదని, అలాంటప్పుడు మేడిగడ్డ నుంచి ఎక్కడ నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. ప్రాజెక్టును అప్పగిస్తే వాడి చూపిస్తామంటున్నారని, 9 ఏండ్లు రాష్ట్రాన్ని ఇస్తేనే 8.21 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే కూలేశ్వరం చేశారు. దీనిని ఆర్థిక విధ్వంసం అంటారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఆర్థిక ఉగ్రవాదులు. వారిది ఆర్థిక ఉగ్రవాద కుటుంబం. దోపిడీనే కాకుండా విధ్వంసం చేశారు. వీళ్లు మారేటోళ్లు కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ పనిచేయలేదు. కోదండరాంలాంటి ఉద్యమకారులెవరైనా కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆయన పక్కన ఉన్నారా?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్, హరీశ్‌రావులేం స్ట్రక్చరల్ ఇంజినీర్లో, సివిల్ ఇంజినీర్లో కాదని, నిజంలాంటి అబద్ధం చెప్పి.. ప్రజ లను మభ్యపెట్టి వసూళ్లు చేయడంలో ఎక్స్‌పర్ట్స్ అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఎలక్షన్స్, కలెక్షన్స్‌లో బాగా ఆరితేరినోళ్లని, వసూళ్లలో ఆ కుటుంబంలోని అందరికీ ఒకటో ర్యాంక్ ఇవ్వొచ్చన్నారు. రిటైర్డ్ ఇంజినీర్ల రిపోర్టు వాళ్లకు అనుకూలంగా రాకపోవడంతో దానిని తొక్కిపెట్టి.. రూ.38 వేల కోట్లతో పూర్తవ్వాల్సిన తుమ్మిడిహెట్టిని కాదని కేవలం పంపులు, లిఫ్టులతోనే రూ.1.47 లక్షల కోట్ల ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు.
దాని వల్ల కొత్తగా నీళ్లు రాలేదని, ఆయకట్టు రాలేదని విమర్శించారు. ఇంత తిన్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాణ్యంగా కట్టి ఉంటే ఇప్పుడు ఈ చర్చ జరిగి ఉండేది కాదన్నారు. 80 వేల పుస్తకాలు చదివి తానే ఈ ప్రాజెక్టును డిజైన్ చేశానని, బ్రెయిన్ చైల్డ్ అంటూ కేసీఆర్ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. 2019 మే 21న ప్రారంభించిన ప్రాజెక్టులో ఏడాది తిరిగేలోపే అంటే 2020 మే 18న ఆ ప్రాజెక్టు ఇంజినీర్లు.. లోపాలున్నాయని, వెంటనే సరిచేయకపోతే ప్రమాదమని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ, ఆ సంస్థ పట్టించుకోలేదన్నారు.
రిపేర్ చేయకపోవడం వల్ల నానాటికీ సమస్య పెరిగి కూలిపోయే స్థితికి వచ్చిందని తెలిపారు. ఇటు 2022లో వచ్చిన వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయిందన్నారు. ఒక్క రోజు.. ఒక్కసారి వచ్చిన సమస్య కాదని, 2020 నుంచే సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే 2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని తెలిపారు. భూమిలో పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించారన్నారు. అసలు ఇక్కడ బ్యారేజీలు నిర్మించేందుకు అనువుగా లేదని అప్పట్లోనే సర్ ఆర్థర్ కాటన్ సర్వే చేసి చెప్పారని తెలిపారు. కేవలం ఇచ్చంపల్లి వద్ద మాత్రమే అనువుగా ఉందని ఆయన నివేదించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్లను పంపుతున్నడు..
బ్యారేజీలుగానీ, ప్రాజెక్టులుగానీ కట్టినప్పుడు కొత్తలో నాలుగేండ్లపాటు 25 శాతం చొప్పున నీటిని స్టోర్ చేసి వాటి లోపాలను తెలుసుకుంటారని.. కానీ, మేడిగడ్డ విషయంలో అలా చేయకుండా తొలి ఏడాదే పూర్తి స్థాయిలో నింపేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. బ్యారేజీలను కేవలం డైవర్డ్ చేసుకోవడానికే వాడుకోవాల్సి ఉంటుందని, డ్యాముల్లో మాత్రమే స్టోర్ చేసి వాడుకుంటామని చెప్పారు.
బంగాళాఖాతాన్ని మంథనికి తీసుకొచ్చామని చూపించుకునేందుకు మేడిగడ్డను నింపేశారన్నారు. నీళ్లను నింపడంతో సీకెంట్ పైల్స్ లీకై 19వ పిల్లర్ కిలోమీటరున్నర కుంగిపోయిందని తెలిపారు. ఇసుక మేడలు కట్టడంతోనే ఇట్ల జరిగిందని వివరించారు. నాలుగు పిల్లర్లు కుంగిపోతే ఏమైతదన్నట్టు ఇప్పుడు బీఆర్‌ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని, కానీ, వెన్నుపూసలో నాలుగు పూసలు పోతే ఏమైతదో తెల్వదా అని నిలదీశారు.
కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది వెన్నుపూస అని చెప్పారు. మనిషికి కాలుకో, చేతికో దెబ్బ తగిలితే మళ్లీ పనిచేసుకోవచ్చని, కానీ, వెన్నుపూసలో నాలుగు పూసలు దెబ్బతింటే మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందన్నారు. పదేండ్లు 80 వేల పుస్తకాలు చదివి కట్టిన కాళేశ్వరం మూడేండ్లలో కూలేశ్వరమైందని రేవంత్మండిపడ్డారు. ఇప్పుడు ఆయనే వచ్చి కాళేశ్వరం అప్పగిస్తే తడాఖా చూపిస్తమంటూ మాట్లాడుతున్నారన్నారు.
పోనీ ఆయనైనా వచ్చి అడిగిండా అంటే అదీ లేదని, మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్లను పంపి ఈ పరిస్థితికి తీసుకొచ్చారని తెలిపారు. వాళ్లు కట్టిన బ్యారేజీ వాళ్ల హయాంలోనే కూలిందని అన్నారు. అసలు దీంట్లో నీళ్లు నింపొద్దని, నింపితే కూలిపోతుందని ఎన్డీఎస్ఏ చెప్పిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం కోసం తెచ్చిన అప్పుల్లో రూ.33 వేల కోట్లు కట్టినం
కాళేశ్వరం కోసం రూ.97 వేల కోట్ల అప్పులు తెస్తే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.33,574 కోట్ల అప్పు చెల్లించామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోకుండానే ఉచితార్థంగా కట్టామన్నారు. రెండున్నరేండ్ల పాలనలో తాము తెచ్చిన అప్పు రూ.1.80 లక్షల కోట్లేనని, కానీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో రూ.2.08 లక్షల కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు. అయినా, ఏ స్కీమ్ కూడా ఆపలేదని చెప్పారు.
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మిలాంటి పథకాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. 3 కోట్ల మందికిపైగా సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. ‘‘50 లక్షల మందికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే సిలిండర్ లాంటివి ఇస్తున్నం. 4.5 లక్షల మందికి రూ.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నం. రూ.9 వేల కోట్లు ఇప్పటికే ఇచ్చినం. రైతు భరోసా కింద ఇప్పటికే రూ.36 వేల కోట్లు ఖర్చు చేసినం. ఫ్రీ కరెంట్ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాం. ఉద్యోగుల బకాయిలు రూ.8 వేల కోట్లు పెట్టిపోతే.. వాటిని క్లియర్ చేస్తున్నం.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రూ.వెయ్యి కోట్ల లాభాల్లోకి తెచ్చినం. ఒక్క అవినీతిని ఆపి.. ఇన్ని పథకాలను నడిపిస్తున్నం. రైతు రుణమాఫీ, బోనస్‌లాంటివి ఇస్తున్నం. ఇన్ని చేస్తున్నా.. మనం ప్రతిపక్షాన్ని ఎందుకు గట్టిగా నిలదీయడం లేదు? ఎందుకు అడగలేకపోతున్నం? ప్రతి వారం సమీక్షిస్తూ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నం. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు చేరడం పెరుగుతోంది. ఇందిరాగాంధీ జయంతి నాడు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ను అమలు చేయబోతున్నం’’ అని వ్యాఖ్యానించారు.
తప్పు చేసినోళ్లే ఎదురుదాడి చేస్తున్నరు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినోళ్లు.. తప్పు చేసినోళ్లే ఎదురుదాడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 16.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతో పాటు తాగునీటి అవసరాల కోసం ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహెట్టి (ప్రాణహిత –చేవెళ్ల) ప్రాజెక్టును ప్రతిపాదించారని గుర్తు చేశారు. కాకా వెంకటస్వామి సూచన మేరకు ఆ ప్రాజెక్టుకు బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతిగా ప్రభుత్వం నామకరణం చేసిందని చెప్పారు.
ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే మహారాష్ట్ర సీఎం పృథ్వీ చవాన్‌తో 2012లో ఆనాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి 148 మీటర్ల ఎత్తుకు ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ఈనాటి తాగునీటి అవసరాలనూ ఆనాడే దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. రూ.11,670 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత.. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం మాజీ ముఖ్యమంత్రికేసీఆర్ ప్రాజెక్టును రీడిజైన్ చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం మొదలైన ఏడాది తర్వాత కేసీఆర్ ఆలోచన మారిపోయిందన్నారు.
ప్రాజెక్టు రీడిజైన్ కోసం 2015లో రిటైర్డ్ ఇంజినీర్లతో కమిటీ వేశారని, కానీ, మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మిస్తే అది ఉండదని కమిటీ సూచించిందని చెప్పారు. ఒకవేళ కట్టాలనుకుంటే వేమనపల్లి వద్ద నిర్మించాలని, కాళేశ్వరం రీడిజైన్ వద్దే వద్దని తేల్చి చెప్పారన్నారు. తుమ్మిడిహెట్టికి డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ సంస్థతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయించారన్నారు. వ్యాప్కోస్ అనేది షెఫ్ లాంటిదని, ఏది ఆర్డర్ ఇస్తే అదే ఇస్తుందని చెప్పారు.
తుమ్మిడిహెట్టిని కట్టి తీరుతం: మంత్రి ఉత్తమ్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి (తుమ్మిడిహెట్టి) ప్రాజెక్టును కట్టి తీరుతామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తక్కువ ఖర్చు, తక్కువ కరెంటు, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. సోమవారం ప్రజాభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మేడిగడ్డ బ్యారేజీ పునాదులు దెబ్బతిన్నాయని, పూర్తిస్థాయి శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తికాకుండానే నీటిని నిల్వ చేయడం ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తులు, దిగువ ప్రాంతాల భద్రతతో చెలగాటమాడటమే అవుతుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పణంగా పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగ్ 2022 నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం అప్పటికే రూ.1.27 లక్షల కోట్లను దాటిందని, ప్రస్తుతం మొత్తం పెట్టుబడి లక్షన్నర కోట్లకు మించి ఉండే అవకాశముందని తెలిపారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంవత్సరానికి సుమారు 3,466 మెగావాట్ల విద్యుత్ సరిపోతే, కాళేశ్వరం కోసం దాదాపు 8,450 మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే విధంగా రూపకల్పన చేశారని చెప్పారు. ఒక తప్పుడు సాంకేతిక నిర్ణయం తెలంగాణపై శాశ్వత విద్యుత్ భారం మోపిందని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టితో 72 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా నీటిని తీసుకెళ్లి.. ఎల్లంపల్లి వద్ద 19 మీటర్ల లిఫ్ట్‌తోనే నీటిని ఎత్తిపోసేందుకు చాన్స్ ఉండేదని వివరించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి మేడిగడ్డకు మార్చడమే తెలంగాణకు భారీ మూల్యం చేసిందన్నారు. ఉత్తర తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు ఆలస్యమవడమే కాకుండా, రాష్ట్రంపై అపార ఆర్థిక, విద్యుత్ భారం పడిందని తెలిపారు.
మీ నాయిన అవినీతికి కాళేశ్వరం బలైంది
కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి పోతుందా.. లేదంటే భూమిలోకి కుంగు తుందా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్ అమెరికాలో ఏ లెక్కన చదువుకు న్నడోగానీ.. కాంగ్రెసోళ్లు బాంబులు పెట్టి పేల్చారంటూ మాట్లాడుతున్నారని మండిప డ్డారు. ‘‘మీ నాయిన అవినీతికి కాళేశ్వరం బలైపోయింది.. మీ కుటుంబ దోపిడీకి గోదావరి జలాలు బలైనయ్. మీ కుటుంబం మొత్తానికి శిక్ష పడాలి.
రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులొస్తే.. కేసీఆర్‌కు మాత్రం వెయ్యి ఎకరాల ఫాంహౌస్, లక్ష కోట్ల ఆస్తులు వచ్చినయ్. కేటీఆర్‌కు జన్వాడలో వంద ఎకరాలు, హరీశ్ రావుకు మొయినాబాద్‌లో 50 ఎకరాలు, కవితకు శంకర్‌పల్లిలో 25 ఎకరాల ఫాంహౌస్లున్నయ్. మరి, రాష్ట్రం ఎందుకు అప్పుల కుప్పైతది. కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడు ఎట్లైతడు? ఆ సూత్రమేదో చెప్తే రాష్ట్రం కూడా బాగుపడుతుంది కదా’’ అని అన్నారు. ఎక్కడైనా దీనిపై ప్రతిపక్షాన్ని ఎండగడ్డాలని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సూచించారు.
