- బీజేపీ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ కె. లక్ష్మణ్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా సీఎం రేవంత్ కు పాలనపై పట్టు రాలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్న హోం, విద్య, మున్సిపల్ శాఖలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని తెలిపారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పక్కనబెట్టి, కేవలం తన పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
30 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 24 సార్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం దారుణమన్నారు. ఒక జిల్లాను అర్థం చేసుకునే లోపే కలెక్టర్లను మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, వరంగల్ లాంటి కీలక జిల్లాల్లో అధికారులను పదే పదే మార్చడంతో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మసీదుల్లో క్యాంపులా..?
సర్ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని లక్ష్మణ్ ఆరోపించారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాల దొంగ ఓట్లను కాపాడేందుకు మజ్లిస్ నేతలు ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మూగప్రేక్షకుడిగా మారిందని విమర్శించారు. బీఎల్వోలు మసీదుల్లో క్యాంపులు పెట్టి ఫారాలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. పాతబస్తీలో చట్టం చెల్లదన్నట్టుగా అక్బరుద్దీన్ మాట్లాడుతుంటే రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతుందని నిలదీశారు.
