- సీబీఎఫ్‌సీ వివాదం నుంచి ఓటీటీలో నిలిపివేత వరకు నాలుగేండ్లుగా అడ్డంకులు
- పంజాబ్‌లో వేలాది గుర్తుతెలియని మృతదేహాల దహనాన్ని బయటపెట్టిన జస్వంత్ సింగ్ ఖల్రా
- ఖల్రా జీవితకథతో దిల్‌జీత్ దొసాంజ్ లీడ్ రోల్‌తో సినిమా తీసిన హనీ టెహ్రాన్
- ఇన్నాళ్లూ రిలీజ్ కాకపోవడం, ఇప్పుడు ఓటీటీ నుంచీ తీసేయడంతో సంచలనం
- దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సినిమా
- ‘సత్లుజ్’ను పరిశీలించేందుకు కమిటీకి పంపిన కేంద్రం
న్యూఢిల్లీ: నాలుగేండ్లుగా సర్టిఫికేషన్ అడ్డంకులు, టైటిల్ మార్పులు, పదే పదే విడుదల వాయిదాల తర్వాత చివరికి శుక్రవారం ఓటీటీలో విడుదలైన ‘సత్లుజ్’ సినిమా రెండు రోజులకే ఓటీటీ నుంచి ఔట్ కావడం సంచలనంగా మారింది. పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను జీ5 భారతీయ కేటలాగ్ నుంచి తొలగించామని, జీ5 గ్లోబల్‌లో మాత్రం ఇది అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చే వరకు ‘సత్లుజ్’ భారతదేశంలో అందుబాటులో ఉండదు. సరైన ప్రక్రియ ద్వారా సినిమాను వీలైనంత త్వరగా మా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తగిన మార్గాలను అన్వేషించడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై జోరుగా చర్చలు మొదలయ్యాయి.
ఖల్రా జీవిత కథ ఆధారంగా..
పంజాబ్‌లో 1980లు, 1990లలో జరిగిన తిరుగుబాటు ఉద్యమం సమయంలో వేలాది గుర్తుతెలియని మృతదేహాలను అక్రమంగా దహనం చేశారని మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా ప్రపంచానికి వెల్లడించారు. తిరుగుబాటు సమయంలో అదృశ్యమైన వేలాది మంది మృతదేహాలను వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు రహస్యంగా దహనం చేసిన ఘటనలకు సంబంధించిన ఆధారాలను ఖల్రా డాక్యుమెంట్ చేశారు.
ఖల్రా దర్యాప్తు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత1995లో ఖల్రా హత్యకు గురయ్యారు. ఖల్రా కిడ్నాప్, హత్యకు కారకులైన నలుగురు పోలీసు అధికారులకు జీవితఖైదు శిక్ష పడింది. ఖల్రా జీవితం ఆధారంగానే సత్లుజ్ సినిమా రూపొందింది. బాలీవుడ్ డైరెక్టర్ హనీ టెహ్రాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఖల్రా పాత్రలో దిల్‌జీత్ దొసాంజ్ నటించారు.
ఎందుకు వివాదాస్పదమైంది?
రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో, ఈ సినిమా సుదీర్ఘ సర్టిఫికేషన్ అడ్డంకులను ఎదుర్కొంది. క్లియరెన్స్ ఇచ్చే ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) భారీ మార్పులను సూచించింది. సాధారణ ఎడిట్‌ల కంటే ఈ డిమాండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని మేకర్స్ ఆరోపించారు. ప్రారంభంలో 21 కట్‌లు సూచించిన సీబీఎఫ్‌సీ తర్వాత ఏకంగా 127 కట్‌లు చేయాలని పేర్కొంది.
ఈ సినిమా నుంచి జస్వంత్ సింగ్ ఖల్రా పేరును కూడా తొలగించాలని బోర్డు తమను కోరినట్లు డైరెక్టర్ హనీ టెహ్రాన్ ఆరోపించారు. సీబీఎఫ్‌సీ సూచించిన కట్‌లను ఆయన అంగీకరించకపోవడంతో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకుండా ఉండిపోయింది. చివరికి ఈ సినిమా అన్‌కట్‌గా ఓటీటీలో శుక్రవారం విడుదలైంది. అయితే, ఓటీటీలో అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే భారతదేశంలో దీనిని తొలగించారు. ప్రస్తుత నిలిపివేతకు, గతంలో జరిగిన సర్టిఫికేషన్ సమస్యలకు సంబంధం ఉందా? లేదా? అనే విషయాన్ని జీ5 స్పష్టం చేయలేదు.
మూడుసార్లు పేరు మార్చినా..
ఈ సినిమాకు సర్టిఫికేషన్ వివాదం కారణంగా మూడు సార్లు పేరు మార్చాల్సి వచ్చింది. మొదట సిక్కుల మారణహోమాలతో ముడిపడి ఉన్న పదం ‘ఘల్లుఘరా’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ‘పంజాబ్ 95’, తాజాగా ‘సత్లుజ్’ పేరుతో ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. కాగా, ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించే అవకాశం ఉందని దిల్‌జీత్ దొసాంజ్ ముందే చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ.. “ఈ రోజు శనివారం. సోమవారం నాటికి దీనిని తీసేయవచ్చని నేను భావిస్తున్నాను. అందుకే మీరు దీనిని డౌన్‌లోడ్ చేసుకోండి” అని దొసాంజ్ సూచించారు.
పరిశీలనకు కేంద్ర కమిటీ
సత్లుజ్ సినిమాను సమగ్ర పరిశీలన, భద్రతాపరమైన తదుపరి చర్యల కోసం ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఏర్పాటు చేసిన ఇంటర్‌డిపార్ట్‌మెంటల్ కమిటీ(ఐడీసీ)కి పంపాలని కేంద్రం యోచిస్తోందని మంగళవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భద్రతా ఆందోళనల కారణంగా ఈ సినిమాను తొలగించాలని జీ5 ఓటీటీని ఆదేశించినట్టు పేర్కొన్నాయి.
ఐటీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 కింద ఏర్పాటైన ఐడీసీ ఈ సినిమాకు అనుమతి విషయాన్ని పరిశీలిస్తుందని వివరించాయి. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ పబ్లిషర్లు ప్రచురించే కంటెంట్‌కు సంబంధించి న ఫిర్యాదులను పరిశీలించి.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
