హైదరాబాద్, వెలుగు: పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వద్దే తేల్చుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ కవితకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుపై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఆ పేరును ఇవ్వలేమని గత నెల 23న కవితకుఈసీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ‘టీఆర్ఎస్’ కాకుండా వేరే పేరును 15 రోజుల్లోగా పంపాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అభ్యంతరాలు చెప్పకుండా తమకు పేరును కేటాయించబోమని ఎన్నికల సంఘం చెబుతుందని, ఆ పేరు తమకు వచ్చేలా చూడాలని కోర్టును కోరారు.
మంగళవారం ఆమె వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఆదేశాలివ్వలేమని చెప్పింది. అది ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని పేర్కొంది. కొంత ఊరటనిచ్చేలా తొలుత ఈసీ ముందు హాజరై అన్ని అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని, ఆ తర్వాత కూడా ఎన్నికల సంఘం ఆ పేరు ఇవ్వబోమంటే విచారణకు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈసీ ఇచ్చిన నోటీసులకు జవాబివ్వాలని పేర్కొంది.
