బీఎల్వోలను బెదిరిస్తున్నారు.. దొంగ ఓట్లు చేరుస్తున్నారు! : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

బీఎల్వోలను బెదిరిస్తున్నారు.. దొంగ ఓట్లు చేరుస్తున్నారు! : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
  • సీఈవోకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్.రాంచందర్ రావు ఫిర్యాదు
  •     పథకాల పేరుతో కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. హైదరాబాద్, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి, సైబరాబాద్ పరిధిలో ఇతర రాష్ట్రాల ప్రజలు లక్షలాది మంది ఉంటున్నారని, వారికి తెలుగు రాదని ఆయన పేర్కొన్నారు. వారందరికీ అర్థమయ్యేలా ఇంగ్లిష్ ఎన్యూమరేషన్ ఫారాలను అందుబాటులో ఉంచాలని కోరారు. 

మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డిని బీజేపీ ప్రతినిధులతో ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. అన్ని ప్రాంతాల్లో మజ్లిస్, కాంగ్రెస్ నాయకులు బీఎల్​వోలను అడ్డుకుంటున్నారని తెలిపారు. అధికారులను బస్తీల్లోకి రానివ్వకుండా, ఒకే చోట కూర్చోబెట్టి తమకు అనుకూలంగా దొంగ ఓట్లు నమోదు చేయించుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓటు నమోదు చేసుకుంటే.. సొంత ఊళ్లలో రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు కట్ అవుతాయని ప్రజలను భయపెడుతున్నారనిచెప్పారు. ఓటు హక్కుపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. 

మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగరాలి..

రానున్న జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మంగళవారం రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపే ఏకైక కొలమానమని, రెండో స్థానం గురించి ఆలోచించకుండా కేవలం విజయం కోసమే ప్రతి కార్యకర్త శ్రమించాలని స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గతంగా భేదాభిప్రాయాలు సహజమని, వాటన్నింటినీ పక్కనపెట్టి ‘యూనిటీ ఈజ్ స్ట్రెంత్’ అనే సూత్రంతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ఇతర నేతలు పాల్గొన్నారు.