భారతీయులే బాసులు.. ఎంఎన్సీలలో మనోళ్ల హవా

భారతీయులే బాసులు.. ఎంఎన్సీలలో మనోళ్ల  హవా
  •  ఇండియా ఎగ్జిక్యూటివ్స్​కు డిమాండ్
  •  రూ.19 కోట్ల వరకు ప్యాకేజీ
  • కంపెనీల కీలక విభాగాలు ఇండియాకు తరలింపు

న్యూఢిల్లీ: మల్టీ నేషనల్​ కంపెనీలు (ఎంఎన్​సీలు)  దేశీయంగా వ్యాపార కార్యకలాపాలను విస్తరించడమేగాక, పెద్ద పోస్టుల్లోనూ మనవాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రొడక్ట్​ డెవెలప్​మెంట్, ఏఐ, ఇంజనీరింగ్, సంస్థాగత నిర్ణయాల విభాగాలను ఇండియాకు తరలిస్తున్నాయి.   ఇక్కడి నుంచి పనిచేసే ఎగ్జిక్యూటివ్స్​కు అంతర్జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగిస్తున్నాయి. భారతదేశానికి అంతర్జాతీయంగా ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఇక్కడి లోతైన నాయకత్వ నైపుణ్యాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) హబ్‌‌లుగా మారడం ఈ ట్రెండ్​కు ప్రధాన కారణాలు.  ఇటీవల ఇలాంటి నియామకాలు భారీగా పెరిగాయని రిక్రూట్​మెంట్​ఏజెన్సీలు చెబుతున్నాయి. అత్యున్నత స్థాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్​ ప్యాకేజీలు రూ.4.5 కోట్ల నుంచి రూ.15-–19 కోట్ల వరకు ఉంటున్నాయి.

వీళ్లు గ్లోబల్, ప్రాంతీయ , స్థానిక ఆఫీసుల బాధ్యతలు చూస్తున్నారు.  ఇండస్ట్రియల్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎమ్ఎస్), గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారతీయ ఎగ్జిక్యూటివ్స్​ హవా నడుస్తోంది.  సీఈఓ పదవులు మాత్రమే కాకుండా, కంపెనీ పరిమాణాన్ని బట్టి సీ1 ,సీసీ-2 స్థాయిల్లోని ఫంక్షనల్ లీడర్‌‌‌‌‌‌‌షిప్ స్థానాలను కూడా చేపడుతున్నారు. ఎంఎన్​సీలు తమ ఏఐ సామర్థ్యాలను, డిజిటల్ ట్రాన్స్​ఫార్మేషన్ ప్రోగ్రామ్‌‌లను విస్తరిస్తున్నందున టెక్నాలజీ రంగానికి డిమాండ్ ఏర్పడింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్, హెల్త్‌‌కేర్ విభాగాల్లోనూ ఈ వేగం కనిపిస్తోంది. భారత్​, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యాపారాలను విస్తరించిన అనుభవం ఉన్న లీడర్లను గ్లోబల్ టీమ్‌‌లను నడపడానికి గ్లోబల్​ కంపెనీలు ఎంచుకుంటున్నాయి.

ఈ విభాగాలకు ఇండియన్లే సారథులు 


గ్లోబల్ ప్రొడక్ట్స్, ప్లాట్‌‌ఫారమ్‌‌లు, ఈ–కామర్స్, సప్లై చైన్ వంటి విభాగాల బాధ్యతలను ఎక్కువగా భారతీయ నిపుణులకు అప్పగిస్తున్నారు.  రిక్రూట్​మెంట్​ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ యాక్సెస్ ఇటీవల ఒక పెద్ద సంస్థ కోసం రూ.ఏడు కోట్ల ప్యాకేజీతో గ్లోబల్ సీహెచ్​ఆర్​ఓ నియామకాన్ని పూర్తి చేసింది. ఆయన ఈ ఉద్యోగం కోసం భారతదేశానికి తిరిగి వచ్చారు. గత మూడేళ్లతో పోలిస్తే ఇలాంటి గ్లోబల్ అవకాశాలు 3–4 రెట్లు పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది.

డిజిటల్ ట్రాన్స్‌‌ఫార్మేషన్, ఫైనాన్స్, కస్టమర్ ఎక్స్‌‌పీరియన్స్ విభాగాల్లో లీడర్లకు డిమాండ్ ఉందని మ్యాన్‌‌పవర్‌‌ గ్రూప్ ఇండియా తెలిపింది. జేపీ మోర్గన్​ చేజ్ వంటి పెద్ద కంపెనీలు కూడా మనదేశంలోని ఎగ్జిక్యూటివ్స్​కు సీనియర్ ​లీడర్షిప్ బాధ్యతలను ఇస్తున్నాయి. టెక్నాలజీ, ప్రొడక్ట్ లీడర్‌‌షిప్ విభాగాల్లో సీటీఓ, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ హెడ్స్, ఇంజనీరింగ్ లీడర్స్ వంటి జాబ్స్​కు ఇండియన్లను నియమించుకోవడం పెరుగుతోంది.