- ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల కృషి
- బొగ్గు బ్లాక్‌ల విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ డబుల్ గేమ్
- కాంగ్రెస్ వచ్చాకే కదలిక
- తాడిచర్ల -2బ్లాక్‌లో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు
కోల్‌బెల్ట్/భూపాలపల్లి, వెలుగు: సింగరేణి భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేంద్రం నేరుగా సింగరేణికి కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతున్నది. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌లో 182 మిలియన్‌టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా.. సుమారు 30 నుంచి 40 ఏండ్ల వరకు బొగ్గును వెలికితీసే ఛాన్స్ ఉంది. కొత్త గనితో బొగ్గుఉత్పత్తితో పాటు సుమారు 2 వేల మందికి ఉపాధి అందుతుంది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచర్ల, పెద్దతూండ్లు, శాత్రజ్పెల్లి అటవీ ప్రాంతాల్లో సుమారు 18.750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తాడిచర్ల 2 కోల్‌బ్లాక్ ఉంది.
6.08 చదరపు కిలోమీటర్ల పరిధిలో 182 మిలియన్ టన్నుల నిక్షేపాలున్నాయని గుర్తించారు. ఈ బ్లాక్ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1,1ఏ గనులు, తాడిచర్ల-1 గని మధ్యలో ఉండడంతో బొగ్గు రవాణాకు అనుకూలంగా ఉంది. తాడిచర్ల-2 గనిని 2013లో సింగరేణికి కేటాయించినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తికి అనుమతులు తీసుకోలేదు. దీంతో సింగరేణి తీవ్రంగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వం 2015లో ఒడిశాలోని నైనీ కోల్‌బ్లాక్‌ను సింగరేణికి కేటాయించగా.. వివిధ కారణాలతో 2025 ఏప్రిల్ 17న గనిని ప్రారంభించింది. నైనీ బ్లాక్ కేటాయించినప్పుడే అదే ప్రాంతంలోని న్యూపాత్రపాద గనిని సైతం కేటాయించినా సింగరేణి తీసుకోలేదు. 2015 తర్వాత సింగరేణికి మరే కొత్త గని దక్కలేదు.
బీఆర్ఎస్ డబుల్ గేమ్
మైన్స్ అండ్ మినరల్స్ సవరణ చట్టం-2015 ప్రకారం.. దేశంలోని బొగ్గు బ్లాకులన్నింటినీ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిసున్నది. కానీ వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత బీఆర్ఎస్సర్కార్అడ్డుకోవడంతో పదేండ్లు సింగరేణికి ఒక్క బొగ్గు బ్లాక్ కూడా దక్కలేదు. బీఆర్ఎస్అధికారంలోకి వచ్చిన తర్వాత 80 మిలియన్ టన్నుల నిక్షేపాలున్న అతిపెద్ద గని తాడిచర్ల 1 ని ఏఎంఆర్ అనే ఆంధ్రా కంపెనీకి 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చింది. అంతేకాకుండా, 2015లో మినరల్ అండ్ మైన్స్ చట్ట సవరణకు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే బీఆర్ఎస్ ఎంపీలుమద్దతిచ్చారు.
కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో సింగరేణిలో బీఆర్ఎష్ అనుబంధ కార్మికసంఘం నామమాత్రంగా ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో కళ్యాణిఖని6, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీలకు కేంద్రం వేలం నిర్వహిస్తే సింగరేణి అందులో పాల్గొనకుండా బీఆర్ఎస్ అడ్డుకుంది. గనులను సింగరేణికే కేటాయించాలని కార్మిక సంఘాలు సమ్మె చేయడంతో నాటి సీఎం కేసీఆర్ ప్రధానికి మొక్కుబడిగా లేఖ రాసి వదిలేశారు.
మంత్రి వివేక్ చొరవతో కేంద్రంపై సీఎం ఒత్తిడి
బొగ్గు గనులను నేరుగా సింగరేణికే కేటాయించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించకపోవడంతో వేలంలో సింగరేణి పాల్గొనేలా అనుమతించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పలుమార్లు ప్రధాని నరేంద్రమోదీ, బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రిని కలిసి నేరుగా బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి కేటాయించాలని కోరారు. దాంతో పాటు బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ఇచ్చింది.
దీంతో సింగరేణి తాజాగా చత్తీస్‌గఢ్‌లోని 'తార', తెలంగాణలోని మణుగూరు ఓసీ-2 డిప్‌సైడ్ ఎక్స్టెన్షన్ మైన్లకోసం టెండర్లు వేసింది. బీజేపీ కూడా ఈ మధ్య సింగరేణి ప్రాంతం మీద దృష్టి సారించింది. ఆ పార్టీ లోకల్ లీడర్లు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికి కేటాయించాలని కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజులు కింద సింగరేణి భవన్లో కేంద్రమంత్రి సింగరేణి యాజమాన్యంతో చేసిన సమీక్షలో రెండు గనులను నేరుగా కేటాయించే చాన్స్ ఉందని ప్రకటించారు. ఆమేరకు తాజాగా తాడిచర్ల బ్లాక్2ను సింగ రేణికి కేటాయించినట్లు కిషన్ రెడ్డి చేసిన ప్రకటనతో కోల్బెల్ట్వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది.
