- ప్రధాని అనుమతితో నిర్ణయం తీసుకున్నాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- కొన్నేండ్లుగా ఈ మైన్‌ను తెలంగాణకు కేటాయించాలని
- ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల విజ్ఞప్తి
- కేంద్రం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తాడిచర్ల–2 బ్లాక్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కు కేటాయించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తర్వాత.. ఆయన అనుమతితో ఈ నిర్ణయం
తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు చేసిన తర్వాత మంగళవారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కొన్నేండ్లుగా ఈ మైన్‌ను తెలంగాణకు కేటాయించాలని ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నుంచి విజ్ఞప్తులు అందాయన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనూ నాటి సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు, సింగరేణి
యాజమాన్యం కూడా తాడిచర్ల కావాలని డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. అలాగే, పార్లమెంట్‌లోనూ తెలంగాణ ఎంపీలు అనేకసార్లు ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు.
అయితే, తెలంగాణ బిడ్డగా రాష్ట్ర అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అంశంలో చొరవ తీసుకున్నట్టు చెప్పారు. 3 రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సింగరేణి సమీక్షా సమావేశంలోనూ.. సంస్థ పురోగతి కోసం తీసుకోవాల్సిన అంశాలు, ఉత్పత్తి పెంచుకోవడం, ఖర్చు తగ్గించుకోవడంలాంటి అంశాలపై సింగరేణి యాజమాన్యానికి సూచనలు చేశానని తెలిపారు. అలాగే, తాడిచర్ల బ్లాక్– -2 విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టు చెప్పారు. అన్ని అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ.. ప్రధాని మోదీ ఏ వేలం లేకుండా తాడిచర్ల–2 బ్లాక్ ను సింగరేణికి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఒడిశాలోని నైనీ బ్లాక్ కోసం ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడి సింగరేణికి ఇప్పించినట్టు చెప్పారు. దీంతో ప్రస్తుతం విజయవంతంగా నైనీ బొగ్గుగనిలో ఇప్పుడు బొగ్గు ఉత్పత్తి అవుతోందన్నారు.
ఎలాంటి వేలం లేకుండానే..
ఎలాంటి వేలం లేకుండానే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో సింగరేణికి తాడిచర్ల –2 బ్లాక్ ను నేరుగా కేటాయించినట్టు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఆక్షన్ ప్రీమియం చెల్లింపులేని కారణంగా సింగరేణి సంస్థకు కనీసం రూ.2,550 కోట్లు మిగులుతుందని తెలిపారు. అంతేకాకుండా రాయల్టీసహా వివిధ మార్గాల్లో తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు రూ.16 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు.
ఇది సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరిగేందుకు, సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని చెప్పారు. ‘‘తాడిచర్ల–2 బ్లాక్ అత్యంత నాణ్యమైన జీ 8 గ్రేడ్ క్వాలిటీ బొగ్గు గని. ఇది సింగరేణికి లాభాలు చేకూర్చుతుంది. దాదాపు 182 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఈ బ్లాక్‌లో ఉన్నాయి.
ప్రతియేటా ఏడాది 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. దాదాపు 40 నుంచి 50 ఏండ్లపాటు ఈ గని నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఈ బ్లాక్ ద్వారా మొత్తంగా రూ.64 వేల కోట్లకుపైగా రెవెన్యూ జనరేట్ కానున్నది. అంతేకాకుండా సుమారు 1,200 అదనపు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ఈ బ్లాక్ కేటాయింపునకు అనుమతిచ్చిన ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు’’ అని తెలిపారు.
ఖర్చులు తగ్గించి, బొగ్గు ఉత్పత్తి పెరిగితేనే సింగరేణికి మనుగడ
సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అని కిషన్‌రెడ్డి తెలిపారు. 137 ఏండ్ల చరిత్ర కలిగిన ఆ సంస్థ అభివృద్ధికి మోదీ సర్కార్ అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. ముఖ్యంగా మేజర్ మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన.. ఎన్విరాన్‌మెంటల్, ఫారెస్ట్ క్లియరెన్స్‌ల వేగవంతానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. 6 నుంచి 8 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో.. 39 వర్కింగ్ మైన్స్‌లో 21 అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయని వివరించారు. ఇందులో దాదాపు 72 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. అయితే సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో, ఆదాయ వనరులు సమకూర్చుకునే విషయంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు.
‘‘సింగరేణి కష్టనష్టాలను చాలా దగ్గర్నుంచి చూశాను. నేను 10 రోజులపాటు సింగరేణి యాత్ర చేశాను. ఇవాళ అదృష్టవశాత్తూ.. నన్ను బొగ్గు శాఖ మంత్రిగా ప్రధాని నియమించారు కాబట్టి.. సింగరేణి పురోగతికి నావంతు సహకారం అందిస్తున్నా’’ అని అన్నారు. అయితే, సింగరేణిలో ఉద్యోగాలు తగ్గి, బొగ్గు ఉత్పత్తి పడిపోతున్నదని తెలిపారు. మరోవైపు సింగరేణికి చెల్లించాల్సిన అప్పుల భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఖర్చులు తగ్గించి, బొగ్గు ఉత్పత్తి పెరిగితేనే సింగరేణి మనుగడ ఉంటుందని సూచించారు.
నైనీలో సమస్యలు తొలిగాయి..మిగిలింది ఉత్పత్తి వేగవంతమే
అడ్మినిస్ట్రేషన్‌లో కేంద్ర బొగ్గు శాఖ ప్రమేయం లేకున్నప్పటికీ.. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక చొరవ తీసుకొని, సింగరేణి విషయంలో సమీక్షలు నిర్వహించి, సంస్థ పురోగతికి తనవంతు ప్రయత్నం చేసినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ‘‘2020 నుంచి ఇప్పటివరకు ఏ కోల్ బ్లాక్‌ను పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్( పీఎస్‌యూ) లకు ఇవ్వలేదు. ఒక్క సింగరేణి విషయంలోనే ఈ చొరవ తీసుకున్నాం. సింగరేణిలో నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది.
వెస్టర్న్ కోల్ ఫీల్డ్ (నాగపూర్), సింగరేణి సంస్థలో వాతావరణ పరిస్థితులు, బొగ్గు క్వాలిటీ దాదాపు ఒకేలా ఉంటాయి. నేను చొరవ తీసుకొని.. రెండింటిని ఉత్పత్తి, రవాణా, ఖర్చులు అన్నింటిపై సర్వే చేసి వివరాలు తెలియజేశాను’’ అని తెలిపారు. ఈ సందర్భంగా.. నైనీ బ్లాక్ విషయంలో వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి స్పందించారు.
‘‘సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన అన్నిచోట్లా ఉంది. నైనీ బ్లాక్ విషయంలోనూ ఇలాంటి నిబంధన ఉన్నప్పటికీ అది సెల్ఫ్ డిక్లరేషన్ (నేను వెళ్లాను, నేను చూశాను. భవిష్యత్తులో దీనిపై ఎలాంటి అభ్యంతరాలొచ్చినా అది నా బాధ్యతే అని ఆ గనిని వేలంలో దక్కించుకున్న వ్యక్తి చెప్పాలి) అని నిర్ణయించాం. నైనీ కోల్ బ్లాక్ కు ఉన్న సమస్యలు తొలగిపోయాయి. ఇక మిగిలింది ఉత్పత్తిని వేగవంతం చేయడమే” అని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది ఎయిమ్స్ ప్రారంభం
వచ్చే ఏడాది భువనగిరిలోని బీబీ నగర్ ఎయిమ్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. ఈ పనులను సమీక్షించేందుకు ఈ నెల 9న తెలంగాణకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా రానున్నట్టు తెలిపారు. ‘‘భువనగిరిలోని బీబీ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ పనులను మంత్రి సమీక్షిస్తారు.
అయితే.. బీఆర్ఎస్ హయాంలో ఎయిమ్స్ బిల్డింగ్ పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ఎయిమ్స్ పనులు 80 శాతం పూర్తి చేసుకున్నాయి. ఈ పనులను పరిశీలించేందుకు రావాలని కేంద్ర మంత్రిని నేను కోరాను. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి తెలంగాణకు వస్తున్నారు. ఆయనతో కలిసి తెలంగాణ పర్యటనకు వెళ్తున్నాను’’ అని కిషన్ రెడ్డి చెప్పారు.
