అక్కడ వానలు.. ఇక్కడ గాలులు .. మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలో భారీ వర్షాలు ..ఇక్కడ వానల్లేక అల్లాడుతున్న రైతులు

అక్కడ వానలు.. ఇక్కడ గాలులు .. మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలో భారీ వర్షాలు ..ఇక్కడ వానల్లేక అల్లాడుతున్న రైతులు
  • అక్కడ వానలు.. ఇక్కడ గాలులు
  • భారీ వర్షాలు, వరదలతో మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలు అతలాకుతలం 
  • ఇక్కడ వానల్లేక అల్లాడుతున్న రైతులు
  • గంటకు 60 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు.. రేపటి నుంచి స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
  • వారంపాటు భారీ వర్షాలు కష్టమేనంటున్న అధికారులు
  • ఈ నెలంతా ఇదే డ్రై వెదర్ ఉండే అవకాశాలు

హైదరాబాద్, వెలుగు:  నైరుతి రుతుపవనాలు కొంచెం లేటైనా మన రాష్ట్రంతో పాటు దేశమంతా విస్తరించాయి. కానీ, పరిస్థితులు మాత్రం చాలా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. వారం క్రితం వరకు వానల్లేక అల్లాడిపోయిన మహారాష్ట్ర.. ఇప్పుడు కుంభవృష్టితో తడిసి ముద్దైపోతున్నది. మహారాష్ట్రతోపాటు గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంటే.. తెలంగాణ మాత్రం వాన చినుకు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో గాలులు తప్ప వర్షం పడడం లేదు. అడపాదడపా కొన్ని చినుకులు పడి పోతున్నాయే తప్ప.. పెద్ద వానలు పడిన దాఖలాలు లేవు.

దీంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల రైతులు పొలాల్లో వేసిన విత్తనాలు మొలకలు రాలేదు. మరికొన్ని చోట్ల మొలిచినా నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రాణహిత మినహా ఇతర ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలేదు. ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరో వారం పది రోజుల పాటు రాష్ట్రంలో పెద్దగా వానలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగి ‘డ్రై సీజన్​’ ఉండే చాన్సెస్ అధికంగా ఉన్నాయంటున్నారు. అప్పుడప్పుడు.. తేలికపాటి వర్షం పడుతుందే తప్ప వారం పాటు భారీ వర్షాల ఊసే ఉండదని చెబుతున్నారు.అదే సమయంలో ఈ వారం పాటు గాలుల ఉధృతి కొనసాగుతుందని స్పష్టంచేస్తున్నారు.  


వారం నుంచి గాలులే..


రాష్ట్రంలో వారం రోజులుగా అక్కడక్కడా మోస్తరు.. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు మాత్రమే కురిశాయి. అదే సమయంలో ఈదురుగాలులు విజృంభిస్తున్నాయి. హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుంటే.. మరికొన్ని చోట్ల ఆ వేగం 50 కిలోమీటర్ల వరకూ ఉంటున్నదని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఉన్న ‘జెట్ స్ట్రీమ్’తోనే మన దగ్గర గాలుల ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు. దాని ప్రభావంతో మన రాష్ట్రంలో కింది స్థాయి గాలుల వేగం పెరిగిందని, దాని వల్ల పొడి వాతావరణమే ఉంటుందని చెబుతున్నారు. మబ్బులు పట్టి ఉన్నా కూడా వర్షాలు పడవంటున్నారు. అల్పపీడనం ఏర్పడినా.. ఈ జెట్ స్ట్రీమ్ వల్లే ఆ ప్రభావం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి వారం పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నా.. జులై నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని, ఎల్​నినో ప్రభావం తీవ్రమవుతున్నదని చెబుతున్నారు.  


అల్లాడుతున్న రైతన్నలు 


జులై మొదటి వారం ముగుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వానలు పడతాయనే నమ్మకంతో దుక్కులు దున్ని, విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు మొలకలు ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరికొన్ని చోట్ల నీరు లేక నారుమళ్లు ఎండిపోతుండగా, బావులు, బోర్లలో కూడా జలమట్టాలు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నది. ఇటు వచ్చే వారం రోజులు గాలులు తప్ప.. వర్షాలుండవని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 60 కిలోమీటర్లు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో మళ్లీ బలమైన అల్పపీడనాలు ఏర్పడితే తప్ప రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో అటు వర్షాలు పడక.. ఇటు నదీ ప్రవాహాలూ రాక.. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులుంటాయా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.