ముంబైలో కనీవినీ ఎరుగని రీతిలో విపత్తు : 6 రోజుల్లోనే 11 వందల చెట్లు ఎందుకు కూలాయి..?

ముంబైలో కనీవినీ ఎరుగని రీతిలో విపత్తు : 6 రోజుల్లోనే 11 వందల చెట్లు ఎందుకు కూలాయి..?

ముంబై మహానగరం.. సముద్ర తీరం.. ఈసారి రుతు పవనాలతో కురుస్తున్న వర్షాలు బీభత్సం చేస్తున్నాయి. దీనికితోడు అందర్నీ ఆశ్చర్యపరిచే ఘటన ఈసారి జరిగింది. ముంబై చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా.. కేవలం 6 రోజుల్లోనే.. 11 వందల భారీ చెట్లు కూలిపోయాయి. చెట్లు కూలిన ఘటనలో ఐదుగురు చనిపోగా.. చాలా మంది గాయపడ్డారు. ముంబై సిటీ ఎన్నో భారీ వర్షాలను చూసింది.. ఎన్నో తుఫానులు చూసింది.. ఎప్పుడూ లేని విధంగా.. ఈసారి వేల సంఖ్యలో భారీ చెట్లు నేలకూలాయి. దీనిపై పర్యావరణ వేత్తలు చెబుతున్నది ఏంటో తెలుసుకుందామా.. 

ముంబై సిటీ కాంక్రీట్ జంగిల్ గా మారింది. రోడ్లపై ఉన్న చెట్ల చుట్టూ సిమెంట్ వేసి.. చదును చేశారు. ఈ క్రమంలోనే చెట్ల వేర్లు బలహీనపడ్డాయి. గత పదేళ్లుగా రోడ్లపై చెట్ల చుట్టూ సిమెంట్ చేయటం.. చదును చేయటం.. ఫుట్ పాత్ పేరుతో బ్రిక్స్ వేశారు. ఇది చెట్ల వేర్లు భూమిలోపలికి వెళ్లటానికి.. బలంగా విస్తరించాన్ని అడ్డుకుంది. దీని వల్ల ఈసారి భారీ చెట్లు వేల సంఖ్యలో కూలిపోయాయి. 

ఇది ఒక కారణం అయితే.. మరో కారణం కూడా ఉంది. నైరుతి రుతు పవనాల సీజన్ లో వర్షాలు పడినప్పుడు గాలి వేగం గంటకు 20 నుంచి 30 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈసారి అందుకు భిన్నంగా గాలి వేగం గంటకు 80 కిలోమీటర్లకు చేరుకున్నది. అంటే ఈ సీజన్ లో గాలి వేగం సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా ఉంది. తుఫాన్ లు వచ్చినప్పుడు మాత్రమే గాలి వేగం గంటకు 80 నుంచి 100 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇప్పుడు తుఫాన్ లేదు.. కనీసం వాయుగుండం, అల్పపీడనం లేదు. అయినా గాలి వేగం గంటకు అత్యధికంగా 80 కిలోమీటర్లుగా నమోదైంది.

బలహీనంగా ఉన్న చెట్ల వేర్లకు తోడు.. గాలి వేగం సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా ఉండటంతో.. ముంబై చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 11 వందల భారీ చెట్లు కూలిపోయాయి. ఇది ప్రకృతి హెచ్చరిక అని.. కాంక్రీట్ జంగిల్ కు నిదర్శనం అని.. పర్యావరణం సమతుల్యత దెబ్బతినింది అనటానికి ఎగ్జాంపుల్ అంటున్నారు నిపుణులు. 

రాబోయే రోజుల్లో భారీ వర్షాలతోపాటు గాలులు తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. చెట్ల కింద ఎవరూ ఉండొద్దని.. వాహనాలను పార్క్ చేయొద్దని సూచిస్తున్నారు అధికారులు.