హైదరాబాద్ నగర భవిష్యత్ నీటి అవసరాలపై జలమండలి (HMWSSB) ఉన్నతాధికారులతో ఎండీ అశోక్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి, విస్తరణకు అనుగుణంగా తాగునీటి పంపిణీకి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే వేసవి కాలంలో నగరవాసులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందే 'ప్రత్యేక కాంటింజెన్సీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. రానున్న 15 రోజుల్లో ఈ ప్రణాళికలు, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి... అక్టోబర్ నాటికల్లా అవసరమైన నీటి మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని గడువు విధించారు.
ప్రస్తుతం సింగూర్‌లో 50 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసిన ఎండీ... ప్రత్యామ్నాయ ప్రణాళికలపై దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ రోజుల్లో, దశలవారీగా నీటి సరఫరా చేసేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కృష్ణా, గోదావరి, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని.. అదనపు పంపింగ్, ఫిల్ట్రేషన్ ఏర్పాటుకు నిధుల కొరత అడ్డంకి కాదని అధికారులకు భరోసా ఇచ్చారు.
గోదావరి, మంజీరా వ్యవస్థల్లో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో నీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పెద్ద ట్యాంకర్ల కోసం ప్రత్యేక ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచిస్తూనే... ట్యాంకర్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు, శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ ట్యాంకర్ బుకింగ్, డెలివరీ, ట్రిప్పులపై సమీక్ష జరపాలని స్పష్టం చేశారు.
మరోవైపు, నగరంలో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని కనీసం 2 శాతం పెంచడమే లక్ష్యంగా జలమండలి నిర్ణయం తీసుకుంది. తాగునీటి వృథాను అరికట్టి, సమాన పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలని... కలుషిత నీటి సరఫరాపై రాజీ పడే ప్రసక్తే లేదని, నీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
