మన వస్త్రాలు లండన్, పారిస్ ఫ్యాషన్ షోలకు వెళ్లాలి.. దక్షిణాసియా ‘టెక్స్టైల్ రాజధాని’గా తెలంగాణ: సీఎం రేవంత్

మన వస్త్రాలు లండన్, పారిస్ ఫ్యాషన్ షోలకు వెళ్లాలి.. దక్షిణాసియా ‘టెక్స్టైల్ రాజధాని’గా తెలంగాణ: సీఎం రేవంత్
  • రాష్ట్ర డీఎన్‌‌‌‌ఏలోనే  వస్త్ర పరిశ్రమ ఉంది 
  • సినీ పరిశ్రమకు ఫ్యాషన్ దుస్తులు రాష్ట్రం నుంచే సప్లై కావాలి 
  • నెట్‌‌‌‌ఫ్లిక్స్, యాపిల్ ఎయిర్‌‌‌‌పాడ్స్ లాంటి 
  • గ్లోబల్ బ్రాండ్లకు కేరాఫ్​గా మారిందని వెల్లడి 
  • 13వ ‘టెక్స్-కాన్’ సదస్సులో సీఎం ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: 
రాబోయే రోజుల్లో తెలంగాణను దక్షిణాసియాలోనే వస్త్ర పరిశ్రమకు తిరుగులేని రాజధానిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన 13వ 'టెక్స్-కాన్'  అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వస్త్ర పరిశ్రమ తెలంగాణ డీఎన్‌‌‌‌ఏలోనే ఉందన్నారు. "శ్రీరామ నవమి రోజు భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణానికి సీఎం హోదాలో నేను స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించాను. ఇది మన వస్త్ర వారసత్వానికి నిదర్శనం" అని పేర్కొన్నారు. నిజాంల కాలం నుంచే హైదరాబాద్ ముత్యాలకు, మేలైన వస్త్రాలకు ప్రపంచ వేదికగా నిలిచిందన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీలు, నారాయణపేట నేత పనితనం వేల కుటుంబాలకు జీవనాధారమని, ఈ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతామని చెప్పారు. 


కేవలం వస్త్రాలే కాకుండా డీప్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ రంగాల్లో తెలంగాణ లీడర్‌‌గా ఉందని సీఎం రేవంత్​ తెలిపారు. "ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లు, మందులను మనం ఇక్కడే తయారు చేస్తున్నాం. గ్లోబల్ బ్రాండ్ యాపిల్ ఎయిర్‌‌పాడ్స్ కూడా తెలంగాణలోనే తయారవుతున్నాయి. ఇప్పుడు టెక్స్‌‌టైల్ రంగంలోనూ అదే స్థాయి గుర్తింపు తెచ్చుకోవాలి" అని పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంతర్జాతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా మారుతోందని, ఇటీవల నెట్‌‌ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడి యోస్‌‌ను ప్రారంభించానని సీఎం చెప్పారు. టాలీ వుడ్, బాలీవుడ్‌‌తో పాటు ఇప్పుడు హాలీవుడ్ కూడా హైదరాబాద్ వైపు చూస్తోందని.. సినీ పరిశ్రమకు అవసరమైన ఫ్యాషన్ దుస్తులు కూడా రాష్ట్రం నుంచే సప్లై కావాలన్నారు.  

  • పెట్టుబడిదారులకు పూర్తి సహకారం

వరంగల్‌‌లోని కాకతీయ మెగా టెక్స్‌‌టైల్ పార్క్ ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మారుతోందని సీఎం తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, రాయితీలతో పాటు వేగవంతమైన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పర్యావరణ హితంగా 'గ్రీన్ టెక్స్‌‌టైల్ హబ్స్‌‌'ను ఏర్పాటు చేస్తామని, యువతకు, మహిళా కార్మికులకు అత్యాధునిక డిజైనింగ్, స్టిచ్చింగ్ పనుల్లో శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. 

మన పత్తి పొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలన్ వంటి నగరాల్లో జరిగే ఫ్యాషన్ షోల వరకు తెలంగాణ బ్రాండ్ చేరాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. "తెలంగాణ రైజింగ్ 2047" లక్ష్యంలో భాగంగా 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.   

  • ఐఐహెచ్​టీ చరిత్రాత్మక ముందడుగు: తుమ్మల

సదస్సులో చేనేత,  టెక్స్‌‌టైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెక్స్‌‌టైల్ రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది వేలాది కుటుంబాల జీవనాధారం, మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం అని పేర్కొన్నారు. చేనేత రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం టెక్స్‌‌టైల్ రంగాన్ని కేవలం ఆర్థిక ప్రగతిగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. టెక్స్‌‌టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక డిజైన్లు ఇన్నోవేషన్‌‌కు ప్రాధాన్యం ఇస్తూ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌‌లూమ్ టెక్నాలజీ స్థాపన ఒక చరిత్రాత్మక ముందడుగు అని మంత్రి తెలిపారు.   

  • మేడిన్ బ్రాండ్ విశ్వవ్యాప్తం చేస్తం: శ్రీధర్ బాబు

చరఖాకు టెక్నాలజీని అనుసధానించి ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ‘న్యూ స్వదేశీ’ విజన్‌‌ కు ఈ వేదికపై నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డిజిటల్ డిజైన్, గ్లోబల్ కనెక్టివిటీ ద్వారా మన నేతన్నల నైపుణ్యాన్ని మిలాన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైకి చేర్చాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నామని వివరించారు. తక్కువ ధర కంటే, అత్యున్నత నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తున్నామని.. బ్లాక్‌‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీస్ సాయంతో సప్లై చైన్ లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు.