గులాబీ నేతల నడుమ గ్రూపుల లొల్లి

గులాబీ నేతల నడుమ గ్రూపుల లొల్లి

రోజురోజుకూ ముదురుతున్న గ్రూప్‍ పాలిటిక్స్  
ఆధిపత్యం కోసం ఎమ్మెల్యేల ఆరాటం

వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో గులాబీ నేతల నడుమ గ్రూపుల లొల్లి ముదురుతోంది. కొన్ని చోట్ల ఇప్పటికే లీడర్ల మధ్య వైరం రచ్చకెక్కగా.. మరికొన్ని చోట్ల లోలోపల విభేదాలు రగులుతున్నాయి. మీటింగుల్లో కలిసిమెలిసిఉన్నట్టే కనిపిస్తున్నా.. పక్కకు జరిగితే చాలు ఒకరిమీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నేతలు, వారి అనుచరులు గ్రూపులుగా విడిపోయి.. సొంత పార్టీలోని లీడర్లమీదే సోషల్‍ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.  

తూర్పులో రచ్చ రచ్చ

వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలెప్పుడూ హాట్‍హాట్‍గానే ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ మిగతా నేతలను ఖాతరు చేయకపోవడంతో వారంతా కూటమి కట్టారన్న వాదన ఉంది. ఇక్కడ నరేందర్​ ఒక వర్గమైతే.. సీనియర్లంతా ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. నియోజకవర్గంలో జరిగే ప్రొగ్రాంలకు నరేందర్‍.. ఎంపీ, ఎమ్మెల్సీ, మేయర్‍, రాష్ట్ర కార్పొరేషన్‍ చైర్మన్లను కూడా పిలవరనే ప్రచారం ఉంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు తమ్ముడు ప్రదీప్‍రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్‍ సారయ్య,  మేయర్‍ గుండు సుధారాణి ఒక వర్గంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కొత్త  కలెక్టరేట్ నిర్మాణానికి స్థలాన్ని ఖరారు చేసిన టైమ్ లో జిల్లా ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి లేకుండానే నరేందర్​ సంబురాలు చేసుకున్నారన్న విమర్శలున్నాయి.  తన వర్గానికి చెందిన రిజ్వానా షమీమ్‍కు డిప్యూటీ మేయర్‍  పోస్ట్​ ఇప్పించుకోవడం ద్వారా బల్దియాలో తనకు చెక్​ పెట్టే ప్రయత్నం చేశారని మేయర్‍ సుధారాణి గుర్రుగా ఉన్నారు. బస్వరాజ్‍ సారయ్య మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన మల్టీ కల్చరల్‍ కాంప్లెక్స్​ను క్యాన్సిల్‍ చేసి, అక్కడ హోటల్‍ హరిత కట్టాలని నిర్ణయించడంతో మాజీమంత్రి అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు.  స్టేట్ రోడ్‍ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ చైర్మన్‍ మెట్టు శ్రీనివాస్‍ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్‍రావు వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చింపివేత ఇరువర్గాల మధ్య మరింత దూరం పెంచింది. వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‍ తీరుపై మంత్రి ఎర్రబెల్లి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎంజీఎంలో ఎలుకల ఘటనకు బాధ్యుడిగా భావించి  తనకు సన్నిహితుడైన ఎంజీఎం సూపరింటెండెంట్‍  శ్రీనివాస్‍రావును కావాలనే బదిలీ బదిలీ చేయించారని నరేందర్ ​కినుక వహించినట్టు తెలుస్తోంది. అందువల్లే టీఆర్ఎస్ రైతుసభకు మంత్రి అటెండై వెళ్లిపోయిన తర్వాత నరేందర్​ అక్కడకు వచ్చారన్న ప్రచారం జరిగింది.   

ఘన్​పూర్​లో పాత పంచాయితీ 

స్టేషన్‍ ఘన్‍పూర్‍ లో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పంచాయితీ ఎప్పటినుంచో రగులుతూనేఉంది. స్థానిక ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య తన మాటే నెగ్గాలని భావిస్తుంటే..  ఎమ్మెల్సీ  కడియం శ్రీహరి పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇద్దరూ యాక్టివ్​గా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో కేడర్​ కూడా రెండుగా చీలిపోయింది. చాలాకాలం పాటు శ్రీహరి ఏ పోస్ట్ ​లేకుండా పార్టీలో ప్రాధాన్యం కోల్పోవడంతో హాపీగా ఉన్న రాజయ్య వర్గం ఆయనకు మండలిలో చోటు దక్కడంతో డీలా పడింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు సురేశ్​ పేరు దళితబంధు జాబితాలో ఉండడం, ఎమ్మెల్యే తమ్ముడు తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు శ్రీహరి వర్గం ప్రయత్నిస్తోంది. 

అన్ని చోట్ల అలకలు.. అసంతృప్తులు

డోర్నకల్‍ లో మంత్రి సత్యవతి రాథోడ్​, ఎమ్మెల్యే రెడ్యానాయక్‍ మధ్య కోల్డ్​వార్​ నడుస్తోంది.  తన కొడుకును  ఎమ్మెల్యేగా చేయాలని రెడ్యా ఆశిస్తుండగా, ఇక్కడి నుంచి పోటీకి సత్యవతి రెడీ అవుతున్నారు. పరకాలలో ఎమ్మెల్యే  చల్లా ధర్మారెడ్డి,  రాష్ట్ర రైతు రుణ విమోచన కార్పొరేషన్‍ చైర్మన్‍ నాగుర్ల వెంకటేశ్వర్లు మధ్య విభేదాలున్నాయి. నాగుర్ల పుట్టినరోజు సందర్భంగా పరకాలలో భారీర్యాలీ తీశారు. లోకల్‍ ఎమ్మెల్యేకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై ధర్మారెడ్డి హైకమాండ్‍కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ములుగు ఇన్​చార్జీ మంత్రి సత్యవతిపై అక్కడి లీడర్లు కూడా సంతృప్తిగా లేరు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‍భాస్కర్​ తీరుపై కొందరు లోకల్​లీడర్లు గుర్రుగా ఉన్నా బయట పడట్లేదు. పార్టీ దళిత నేత, రాష్ట్ర ఆటో యూనియన్‍ అధ్యక్షుడు గుడిమల్ల రవి తనను వినయ్​భాస్కరే కేసులో ఇరికించాడని ఆరోపిస్తున్నారు.  

కవిత వర్సెస్​ శంకర్‍నాయక్‍ 

మహబూబాబాద్‍లో ఎంపీ మాలోత్‍ కవిత, ఎమ్మెల్యే శంకర్‍నాయక్‍  మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ హైకమాండ్‍ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా కవితను నియమించడంతో ఇద్దరి మధ్య లొల్లి ఎక్కువైంది. ఇటీవల జరిగిన రైతుసభలో కవిత మాట్లాడుతుండగా శంకర్‍ నాయక్‍ మైక్‍ గుంజుకోవడం హాట్‍ టాపిక్‍ అయింది. ఈ విషయంలో  అధిష్టానం కూడా సీరియస్​ అయ్యింది. ఎంపీ కవిత అనుచరుడు, మహబూబాబాద్ 8వ వార్డ్​ కౌన్సిలర్‍ రవి నాయక్‍ మర్డర్ ఇద్దరి మధ్య విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో స్పష్టం చేసింది. హత్యతో సంబంధంలేదని, తనను కొందరు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని శంకర్‍నాయక్‍  చెప్తున్నా కవిత అనుచరులు నమ్మడంలేదు.