మ్యాన్ హోల్‌లో ఊపిరాడక ఇద్దరు మృతి

మ్యాన్ హోల్‌లో ఊపిరాడక ఇద్దరు మృతి
  •   108, ఫైర్, పోలీస్ సిబ్బంది శ్రమించినా దక్కని ఫలితం 
  •   నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం 

మిర్యాలగూడ: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లీనింగ్ పనులు చేస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మ్యాన్ హోల్ లోకి దిగిన కూలీ, వర్క్ సూపర్ వైజర్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో శనివారం జరిగింది. తాళ్లగడ్డలోని ఎస్టీపీ ప్లాంట్ పరిధిలో కొన్ని రోజులుగా మ్యాన్ హోల్స్ పనులు చేస్తున్నారు. శనివారం పూడికతీత పనులు చేపట్టగా.. యాద్గార్​పల్లికి చెందిన కుంచం చిన్న, అతని బంధువు కుంచం శ్రీనివాస్​(36) కూలికి వెళ్లారు. ఈ క్రమంలో తాళ్లగడ్డ మహాలక్ష్మీ రైస్​మిల్ సమీపంలోని 15 ఫీట్ల లోతున్న మ్యాన్​హోల్ లో పూడిక తీసేందుకు ఇద్దరూ దిగారు. అయితే చిన్నకు శ్వాస ఆడకపోవడంతో శ్రీనివాస్ అతణ్ని పైకి పంపించాడు. ఇదే టైమ్ లో శ్రీనివాస్ కు కూడా ఊపిరాడక, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన దొండవారిగూడెంకు చెందిన వర్క్​సూపర్​వైజర్​ పాశం సంతోశ్​రెడ్డి (31) వెంటనే మ్యాన్​హోల్​కి దిగాడు. అయితే మ్యాన్ హోల్ లో ఇద్దరికీ ఊపిరాడకపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. స్థానికులు గమనించి 108, ఫైర్, పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు స్పాట్ కు వచ్చి మ్యాన్ హోల్ లోకి ఆక్సిజన్ పంపించారు. ఇద్దరినీ బయటకు తీసి, ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. సంతోశ్​రెడ్డికి భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. డెడ్​బాడీలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్​టౌన్​ పోలీసులు తెలిపారు. 
 

మ్యాన్‌హోల్ లోకి దిగిన మేస్త్రి.. 

మ్యాన్ హోల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్, సంతోశ్ రెడ్డికి ఆక్సిజన్ పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 15 అడుగుల లోతున్న మ్యాన్​హోల్​లోకి దిగేందుకు అందరూ భయపడ్డారు. ఈ టైమ్‌లో అక్కడికి చేరుకున్న భవన నిర్మాణ మేస్త్రి గుంజ శంకర్​ధైర్యంగా ముందుకొచ్చాడు. 108, ఫైర్, పోలీస్ సిబ్బంది సహకారంతో మ్యాన్ హోల్ లోకి దిగి ఆక్సిజన్ పైపు అమర్చినా వారి ప్రాణాలు దక్కలేదు. 

రెండేండ్ల క్రితం భార్య.. ఇప్పుడు భర్త 

శ్రీనివాస్ భార్య జ్యోతి రెండేండ్ల క్రితం స్టవ్​ పేలి మరణించింది. ఇప్పుడు శ్రీనివాస్ కూడా చనిపోవడంతో.. ఆ దంపతుల కుమారుడు, కుమార్తెకు 60 ఏండ్ల నానమ్మనే దిక్కయింది. 
ప్రాణాలు కోల్పోయిన కూలీ, వర్క్ సూపర్‌‌వైజర్