ఐటీ జాబ్స్ పేరిట మోసం 49 మంది నుంచి రూ.18లక్షలు వసూలు

ఐటీ జాబ్స్ పేరిట మోసం 49 మంది నుంచి రూ.18లక్షలు వసూలు
  •   బోర్డు తిప్పేసిన ‘రైల్ వరల్డ్ ఇండియా’ కంపెనీ

గచ్చిబౌలి, వెలుగు: సాఫ్ట్​వేర్​ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించి, ట్రైనింగ్ ఇచ్చిన ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. 49 మంది నిరుద్యోగులను మోసం చేసి దాదాపు 18లక్షలు వసూలు చేసింది. రాయదుర్గం ఇన్​స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. సిటీలో ఉండే యశ్వంత్ కు మే 9న సుస్రుత అనే యువతి కాల్ చేసింది. తాను గచ్చిబౌలి టెలికామ్​నగర్​లోని ‘రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్​లిమిటెడ్’ కంపెనీ హెచ్ఆర్ ని అని పరిచయం చేసుకుంది. 

తమ కంపెనీలో జాబ్​వేకెన్సీలు ఉన్నాయని నమ్మబలికింది. ఫ్రెషర్స్​కు తామే ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగం కల్పిస్తున్నామని వివరించింది. ఆసక్తిగా ఉంటే ఇంటర్వ్యూకు రావాలని పిలిచింది. నమ్మిన యశ్వంత్​మే10న ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఇంటర్వ్యూ పూర్తయ్యాక మీరు సెలెక్ట్ అయ్యారని,100 రోజులపాటు ట్రైనింగ్ ఇస్తామని, ఆ తర్వాత ఎగ్జామ్​ఉంటుందని హెచ్ఆర్​సుస్రుత తెలిపింది. 

సెక్యూరిటీ డిపాజిట్​కింద రూ.40 వేలు చెల్లించాలని, ట్రైనింగ్​తర్వాత రీఫండ్​చేస్తామని నమ్మించింది. మే18న యశ్వంత్ డబ్బు కట్టేందుకు కంపెనీకి వెళ్లాడు. సుస్రుతతోపాటు దీక్షా షిండే, రమ్య అనే మరో ఇద్దరు హెచ్ఆర్​లుగా పరిచయం చేసుకున్నారు. సదరు కంపెనీకి బెంగుళూరులో ఉండే ప్రకాశ్ సింగ్​డైరెక్టర్ అని వారు తెలియజేశారు. తర్వాత యశ్వంత్​వారికి ఫోన్​పే ద్వారా రూ.40వేలు చెల్లించాడు. 

ఈ నెల 3న యశ్వంత్​తోపాటు మరో 10 మంది ట్రైనింగ్​పూర్తిచేసుకున్నారు. 13వ తేదీ వరకు ఆఫీసులోని ట్రైనింగ్​సెషన్​కు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత రోజు నుంచి ఆఫీస్ క్లోజ్ లో ఉండడంతో తాము మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. కంపెనీ డైరెక్టర్​ప్రకాశ్​సింగ్, మేనేజ్​మెంట్​పై చర్యలు తీసుకోవాలని బుధవారం రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. 

రైల్ వరల్డ్ ఇండియా ప్రై.లిమిటెడ్​కంపెనీకి హైదరాబాద్​తోపాటు ముంబై, పుణె, బెంగళూరులో బ్రాంచులు ఉన్నట్లు తెలిపారు. మే నెలలో హైదరాబాద్​బ్రాంచ్ ను  ఓపెన్ చేశారని చెప్పారు. యశ్వంత్​కలిపి మొత్తం 49 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.40 వేలు నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్లు సమాచారం.