- 1,082 బెడ్లు, అందులో 300 ఐసీయూ, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు
- దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్
- దీంతో ఆస్పత్రిలో ఎక్కడికైనా 2 నిమిషాల్లోనే శాంపిల్స్, రిపోర్ట్స్, మందులు, పరికరాలు చేరవేయొచ్చు
- 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించిన హాస్పిటల్ ఏర్పాట్లను పరిశీలించిన
- మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్)ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా ఇది నిలవనుంది. 22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో నాలుగు ప్రధాన బ్లాకులుగా క్లాసిక్ ఆర్కిటెక్చర్‌తో ఈ హాస్పిటల్‌ను తీర్చిదిద్దారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నంప్రభాకర్ తదితరులు ఉన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌ను ఒకే దశలో, సంపూర్ణ మాస్టర్‌ప్లాన్ కింద నిర్మించారు. మొత్తం 1,082 బెడ్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ హాస్పిటల్‌లో దాదాపు 300 బెడ్లు ఐసీయూకే కేటాయించారు. మరో 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించారు. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ, 12 మైక్రోబయాలజీ, 10 బయోకెమిస్ట్రీ, మరో 5 స్పెషల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. బ్లాక్ --ఏలో ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. బ్లాక్–-బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లాక్- -సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లతో పాటు సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. బ్లాక్ డీని అడ్మినిస్ట్రేషన్, అకడమిక్ విభాగాలతో పాటు 200 మంది కూర్చునే ఆడిటోరియంతో తీర్చిదిద్దారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:
మంత్రి దామోదర్ రాజనర్సింహ
టీమ్స్ హాస్పిటల్‌లో జరుగుతున్న ప్రారంభ ఏర్పాట్లను హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. అనంతరం పోలీస్, జీహెచ్‌ఎంసీ, జలమండలి, సమాచార పౌర సంబంధాల శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం, ఇతర ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, పటిష్ట బందోబస్తు, పార్కింగ్, నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరా, హాస్పిటల్ పరిసరాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐఅండ్ పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ అశోక్ రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌తో శాంపిల్స్...
దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ హాస్పిటల్‌లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా బ్లడ్ శాంపిల్స్, మందులు, రిపోర్టులు, ఎమర్జెన్సీ వస్తువులను వార్డులు, ఐసీయూ, ల్యాబ్‌లు, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1 నుంచి 2 నిమిషాల్లోనే చేరవేయవచ్చు. రోగ నిర్ధారణ కోసం 3.0 టెస్లా ఎంఆర్‌ఐ, 128-స్లైస్ సీటీ స్కానర్, అడ్వాన్స్‌డ్ మామోగ్రఫీ, 5 ఎక్స్‌రే యూనిట్లను సమకూర్చారు. రోగుల సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో 200 మంది సామర్థ్యంతో ధర్మశాల నిర్మించారు. 30 డెడ్‌బాడీల సామర్థ్యంతో మార్చురీ, సెంట్రల్ కిచెన్, లాండ్రీ, మెడికల్ ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పర్యావరణ అనుకూలంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు 75 శాతం నీటిని ఆదా చేస్తూ ఐజీబీసీ గోల్డ్ రేటింగ్‌ను దక్కించుకుంది.
