మా కాన్వొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీజేఐ వద్దు..బెంగళూరులోని నేషనల్ లా వర్సిటీ స్టూడెంట్ల వ్యతిరేకత

మా కాన్వొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీజేఐ వద్దు..బెంగళూరులోని నేషనల్ లా వర్సిటీ స్టూడెంట్ల వ్యతిరేకత
  •     హైదరాబాద్ నల్సార్ వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా నిర్ణయం 


బెంగళూరు: కర్నాటక బెంగళూరులోని ప్రతిష్టాత్మక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ఐయూ) స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడంపై ఆ యూనివర్సిటీ స్టూడెంట్లు, పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్‌‌‌‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌ను నిలిపివేస్తూ గతంలో బీసీఐ జారీ చేసిన ఆదేశాలను (తర్వాత వెనక్కి తీసుకున్నప్పటికీ) వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ఐయూకి చెందిన 2026 బ్యాచ్‌‌‌‌కు చెందిన 165 మంది గ్రాడ్యుయేట్లు, 409 మంది ప్రస్తుత విద్యార్థులు, 128 మంది పూర్వ విద్యార్థులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్నవారి తప్పిదాలను ధైర్యంగా ప్రశ్నించిన హైదరాబాద్ నల్సార్ విద్యార్థులకు వారు సంఘీభావం ప్రకటించారు.

నల్సార్ విద్యార్థులపై ప్రారంభించిన చర్యలను బీసీఐ ఉపసంహరించుకున్నప్పటికీ, ఒక చట్టబద్ధమైన సంస్థ యూనివర్సిటీ స్టూడెంట్లు, లెక్చరర్లపై ఏకపక్ష చర్యలకు పాల్పడటం తీవ్రమైన విషయమని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో బీసీఐ, దాని చైర్మన్ తమ బాధ్యత నుంచి తప్పుకోలేరని స్పష్టం చేశారు. స్నాతకోత్సవం అనేది విద్యార్థుల ఏండ్ల శ్రమకు దక్కే గౌరవమని, అలాంటి పవిత్ర వేదికలో విద్యార్థుల పట్ల బహిరంగంగానే చిన్నచూపు చూసిన ఉన్నతాధికారులను పిలిచి, వారి చేతుల మీదుగా డిగ్రీలు ప్రదానం చేయడం విద్యార్థులను, వారి పోరాటాన్ని అవమానించడమేనన్నారు. తమ చర్యలకు బాధ్యత వహించకుండా ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ఐయూ కాన్వొకేషన్‌‌‌‌కు వస్తున్న సీజేఐతో పాటు బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.