సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి : జూపల్లి

సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి : జూపల్లి
  •     కళారూపాలు వినోదానికే కాదు.. సామాజిక చైతన్యానికి ఆయుధం: జూపల్లి
  •     డ్రగ్స్, సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచన
  •     సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో మంత్రి ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, కళారూపాలు, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌ ఫోరమ్‌‌‌‌ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘సాంస్కృతిక సంబరాలు–2026 (హైదరాబాద్‌‌‌‌ జిందాబాద్‌‌‌‌)’ కార్యక్రమానికి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతరలు తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. పేరిణి శివతాండవం, ఒగ్గుడోలు, గుస్సాడి, చిందు యక్షగానం వంటి జానపద కళారూపాలు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయని చెప్పారు. 

హైదరాబాద్ సమ్మిళిత సంస్కృతికి ప్రతీక అని.. చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌‌‌‌షాహీ సమాధులు నగర చారిత్రక సంపదకు నిదర్శనమని కొనియాడారు. కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని, యువతలో సాంస్కృతిక ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఉండాలని సూచించారు. సమాజంలో పెరుగుతున్న ఆర్భాటాలు, కార్పొరేట్ విద్య, వైద్య దోపిడీ, యువతలో డ్రగ్స్ వ్యసనాలు, నేర ప్రవృత్తి వంటి రుగ్మతలపై పోరాడేందుకు కళలు, సాహిత్యం, మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు.