- కేసీఆర్ సీఎం అయితే ఆయన ఇంటోళ్లు, బంధువులకే పదవులు
- కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లాభం: సీఎం రేవంత్‌రెడ్డి
- పదేండ్లు ఉద్యోగాలు ఇవ్వలే.. ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నరు
- బీఆర్ఎస్ లీడర్ల మాయమాటలు విని మోసపోవద్దు
- విడతలవారీగా నియామకాలు చేపడతాం.. ప్రతి ఖాళీని భర్తీ చేస్తం
- వచ్చేనెల అసెంబ్లీ పెట్టిస్తా.. కేసీఆర్‌ను తీసుకొనిరావాలని సవాల్
- వాళ్లు చుక్క రక్తం ఇయ్యలే.. కార్యకర్తల రక్తం అమ్ముకున్నరు
- హరీశ్‌రావు.. అగ్గిపెట్టె రావు, అఘోరా రావు అంటూ ఫైర్
- హనుమకొండ జిల్లా పరకాల బహిరంగ సభలో సీఎం
హనుమకొండ/ ములుగు/ పరకాల, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్ అయితే, తనది సోషల్ జస్టిస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎం అయితే కేవలం ఆయన కుటుంబానికే లాభమని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లాభమని చెప్పారు. ‘‘కేసీఆర్ సీఎం అయితే.. కేటీఆర్‌ను, హరీశ్‌రావును మంత్రులను చేసిండు. సంతోష్ రావును రాజ్యసభకు పంపిండు. ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రిని చేసిండు. కవితను ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీని చేసిండు. వినోద్ రావును కరీంనగర్ లో బండకేసి కొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించిండు. కానీ.. నేను ముఖ్యమంత్రి అయితే.. సీతక్క, కొండా సురేఖను మంత్రులుగా చేశాను. కడియం కావ్య ఎంపీ, యశస్విని ఎమ్మెల్యే అయ్యారు.
అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రిని చేసిన. మిత్ర ధర్మం కోసం మీ వరంగల్ బిడ్డ వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపిన. జేఏసీ చైర్మన్ కోదండరాంను ఎమ్మెల్సీని చేసిన. అంతేకాదు.. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసుకున్నడు. నేను.. బీసీ సోదరుడు మహేశ్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేసిన. అలాగే, ప్రొ.జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ విలేజ్‌గా మార్చిన. కేసీఆర్ పాలనలో ఎవరెవరికి లాభం జరిగిందో.. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరెవరికి న్యాయం జరిగిందో పక్కాగా లెక్కలు చెప్తా. మీరు పోల్చుకోండి. చూడండి. చంద్రశేఖర్ రావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే.. నేను చేసింది సోషల్ జస్టిస్..” అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఇతర నేతలతో కలిసి సీఎం రేవంత్ ఆదివారం హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటించారు. ముందుగా మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న ఆయన.. ఎత్తుబంగారంతో వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ములుగు గట్టమ్మ ఆలయం వద్ద రూ.16,007 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. తరువాత ములుగు కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి పరకాలకు చేరుకున్న ఆయన రూ.484.42 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజాపాలన–-ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తమది సామాన్యుల కోసం పని చేసే ప్రభుత్వమని, వేయి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరన్నారు.
నిరుద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నరు
బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారని.. నిరుద్యోగులను రెచ్చగొట్టి ధర్నాలు, నిరసనలు చేయమంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేవలం నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలను పల్లీబఠానీల్లా అమ్ముకుని కోట్లు సంపాదించారని అన్నారు. 10వ తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోయారని, 12వ తరగతి పరీక్షలు పెట్టినా.. తప్పుడు విధానాలతో 27 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలతో వందల కోట్లు వెనుకేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్, టూ, త్రీ, ఫోర్, పోలీస్, మెడికల్, హెల్త్, ఇతర శాఖల్లో 70 వేల నియామకాలు పూర్తి చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు వింటే మోసపోతారని, ప్రభుత్వంలోని ప్రతి ఖాళీని భర్తీ చేస్తామని నిరుద్యోగులకు స్పష్టం చేశారు. విడతల వారీగా నియామకాలు చేపడతామని చెప్పారు. ఆందోళనలకు దిగి పోలీసులు కేసులు పెడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని సీఎం హితవుపలికారు. నాడు ఉద్యమంలో పెట్టిన కేసులు ఇప్పటికీ వెంటాడుతున్నాయని గుర్తు చేశారు.
సమ్మక్క సారలమ్మ క్షేత్రాన్ని టూరిస్ట్ స్పాట్ చేస్తం
దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన సమ్మక్క సారలమ్మ జాతరను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, సమ్మక్క సారలమ్మ సన్నిధిని అనాథ దేవాలయంగా వదిలేసిందని సీఎం రేవంత్ విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత సమ్మక్క సారలమ్మ గుడిని ప్రపంచాన్ని ఆకర్షించేలా.. రామప్ప, వేయి స్తంబాల గుడితో పోటీ పడేలా అభివృద్ధి చేశామన్నారు. జంపన్నవాగును కూడా అభివృద్ధి చేస్తామని, సమ్మక్క సారలమ్మ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ములుగులో సాగు నీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్, ఏటీసీ, భవిష్యత్తులో ఇంకా సాంకేతిక విద్య నేర్పించడం కోసం ఏం కావాలన్నా నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. విద్యతో పాటు స్కిల్స్ ఉంటేనే ప్రపంచం ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలుకుతుందన్నారు. అందుకే నర్సరీ నుంచి 12 వరకు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్‌తోపాటు జర్మనీ, జపనీస్, కొరియన్ లాంగ్వేజెస్ నేర్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
అమరధామాన్ని టూరిస్ట్ స్పాట్ చేయండి: రేవూరి
స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టంలో పరకాలకు ప్రత్యేక చరిత్ర ఉందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పాలన నుంచి విముక్తి కోసం పరకాల గడ్డ పోరాటం చేసిందన్నారు. కానీ 1947 సెప్టెంబర్ 2న స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న 25 మంది ఉద్యమకారులు రజాకార్ల తూటాలకు బలయ్యారని, వారి స్మారకార్థం పరకాలలో నిర్మించిన అమరధామాన్ని టూరిస్ట్ స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, విప్ రామచంద్రు నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, యశస్విని రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మురళి నాయక్, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ పాల్గొన్నారు.
వచ్చే నెల అసెంబ్లీ పెట్టిస్తా.. కేసీఆర్‌ను తీసుకొనిరండి..
‘‘బావా బావమర్దులు శాసన సభ ఏర్పాటు చేయండి.. కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో.. రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరిగిందో చర్చిద్దామని అంటున్నారు. బావా బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్‌లో అసెంబ్లీ పెట్టిస్తా.. వారు కేసీఆర్‌ను కూడా తీసుకొని రావాలె. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 ఏండ్ల అనుభవం ఉన్న చంద్రశేఖర్ రావు శాసన సభకు రావాలి. పది సంవత్సరాల పాలనలో.. వారు తెచ్చిన పథకాలు, అభివృద్ధి గురించి కూడా చర్చించాలె. వారు మనకు వారసత్వంగా అందించిన రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుకు ప్రతి సంవత్సరం రూ. 75 వేల కోట్ల అసలు, మిత్తి కడుతున్నం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అవసరమైతే మట్టిలో కలిసినా సరే.. మాట తప్పేది లేదు. మడమ తిప్పేది లేదు.. ఈనాడు మీకోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా.. కాళేశ్వరం కూలి కూలేశ్వరం అయినా.. వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానం సాధించిన ఘనత మన రాష్ట్రానిది. రైతు రుణమా ఫీ చేస్తానని కేసీఆర్ మన నెత్తిమీద చిప్ప పెట్టి పోయిండు.. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతు రుణమాఫీ చేసిన. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున రూ.36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినం. రైతులకు ఫ్రీ కరెంట్ కోసం రూ. 30 వేల కోట్లు ఖర్చు చేశాం. గడిచిన 30 నెలల్లో రైతుల కోసమే రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేసి.. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేశాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అగ్గిపెట్టె రావు.. అఘోరారావు..!
ఆ నాడు.. అగ్గిపెట్టె రావు.. అఘోరా రావు.. వంద రూపాయలు పెట్టి బాటిల్ నిండా పెట్రోల్ తెచ్చుకున్నడు.. కానీ పది పైసల అగ్గిపెట్టె తెచ్చుకోలేదు.. రెచ్చగొట్టిండు.. అమయాకులైన పిల్లలు ఆవేశానికి లోనైండ్రు.. శ్రీకాంతాచారి ఎల్బీనగర్‌లో నిట్ట నిలువున తగలబెట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నడు.. ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఇక ఇషాన్ రెడ్డి.. ఒక వేణుగోపాల్ రెడ్డి.. 1,200 మంది పిల్లలు వీళ్లు రెచ్చగొడితే.. వీళ్లు వీధి నాటకాలు వేస్తే.. ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకుండ్రు.. కానీ చంద్రశేఖర్ రావు కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేయి కాలిందా..? వాళ్ల కుటుంబంల.. వాళ్ల బంధవులల్ల ఎవరన్నా తెలంగాణ కోసం త్యాగం చేసిండ్రా..? రెచ్చగొట్టాలె.. మంది పిల్లలను సావగొట్టాలె.. ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలన్నదే వాళ్ల ఆలోచన. రాష్ట్రంలో వర్షాలు కురవకుండా కరువు రావాలని, ప్రజలు చావాలని హరీశ్ రావు తమిళనాడు, కర్నాటకలో అఘోరాలతో క్షుద్రపూజలు, చేతబడులు చేయిస్తున్నాడు. అధికారం పోతే ప్రజల చావు కోరుకుంటారా? ఎన్ని క్షుద్రపూజలు చేసినా దేవుడు మా వైపే ఉన్నాడు. ఎల్ నినో ప్రభావం ఉన్నా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నాడు బతుకమ్మ చీరల్లో కూడా కమీషన్లు మెక్కారు. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఫామ్ హౌస్‌లో పడ్డారు.
కార్యకర్తల రక్తం అమ్ముకుండ్రు
గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి.. మా రక్తం తీసుకోండి అని తెలంగాణ భవన్‌లో రక్తదానం పెట్టిండ్రు.. తిన్న కొవ్వు అరుగుతది హరీశ్ రావుకు, కేటీఆర్‌కు అని అనుకున్న.. కానీ వాళ్ల కుటుంబంల ఒక్కరు కూడా రక్తం ఇయ్యలే.. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తం ఇస్తే.. ప్రైవేటు ఆస్పత్రులకు పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నరు. చివరకు మీ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకుంటున్నరంటే మీరు మనుషు లా..? రాక్షసులా..? రక్త పిపాసులా..? ఎందుకు రక్తం ఇవ్వలే? కేసీఆర్‌కు ఆరోగ్యం బాగాలేదనుకుందాం! హరీశ్ రావు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తం.. గోడలు దుంకుతం అంటుండ్రు కదా! చుక్క రక్తం కూడా ఎందుకు ఇవ్వలేదని అడుగు తున్న.. రాజ్య సభ సీటు తీసుకున్న సంతోష్ రావు ఎందుకు ఇవ్వలేదు.. మంత్రి పదవి తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఎందుకు ఇవ్వలేదు.. వినోద్ రావు ఎందుకు ఇయ్యలే.. వాళ్లు సుక్క రక్తం బొట్టు ఇవ్వరు.. తెలంగాణ ప్రజల సొమ్మ వేల కోట్లు కొల్లగొడ్తరు.. చివరకు కార్యకర్తల రక్తాన్ని కూడా అమ్ముకొనే రక్త పిపాసులు కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు.
సోషల్ జస్టిస్‌ను కాపాడుతున్నాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమంతో సోషల్ జస్టిస్‌ను కాపాడుతూ రాష్ట్ర సర్కార్ ముందుకు పోతోందని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కులగణన చేపట్టి, తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ చేసిన గణనను ప్రధాని మోదీ రోల్ మోడల్‌గా తీసుకొని దేశం మొత్తం సర్వే చేయించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలకు సుమారు 43 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.
మనసుపెట్టి పని చేస్తుంటే తప్పుడు కూతలా?: సీతక్క
ములుగు అభివృద్ధి కోసం మనసు పెట్టి పని చేస్తుంటే కొందరు తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. తనపై తప్పుడు కూతలు కూసినవాళ్లు బాగుపడరని, వారి సంగతి సమ్మక్క సారలమ్మలే చూసుకుంటారని చెప్పారు. ములుగు అంటే అడవులు, నిర్లక్షరాస్యులు తప్ప అభివృద్ధి ఉండదని అనేవారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మారుమూల జిల్లాను హైదరాబాద్‌తో పోటీ పడేలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ములుగు తలాపునే గోదావరి ఉన్నా గత ప్రభుత్వం చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని, కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పొట్లాపురం లిఫ్ట్‌తో పాటు రామప్ప, లక్నవరం అనుసంధానానికి రూ.200 కోట్లు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ములుగు జిల్లాకు చేసిందేమీ లేదని, కేవలం తనను ఓడించడానికి రూ.వంద కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎన్నికల స్టంట్లుగా మెడికల్ కాలేజీ, కలెక్టరేట్‌లకు శంకుస్థాపనలు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన వాటికి కలర్లు వేసుకుం టున్నారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. తాము చెప్పిందే చేస్తామని, చేసేదే చెప్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఏడాదిలోగా దేవాదులను పూర్తి చేస్తాం: పొంగులేటి
దేవాదుల ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పూర్తి చేయలేకపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదిలోగా దేవాదుల పనులు వంద శాతం పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేలా చూస్తామన్నారు. మామునూర్ ఎయిర్ పోర్టు తీసుకొచ్చామని, భూసేకరణకు రూ.300 కోట్లు చెల్లించామన్నారు. వరంగల్‌లో రూ.5,700 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కొద్ది రోజుల్లోనే పూర్తి చేయబోతున్నామని చెప్పారు.
ఆడబిడ్డను గెంటేసిన నీచమైన చరిత్ర కేటీఆర్‌ది ఆస్తిలో భాగం ఇయ్యాల్సి వస్తదని ఆడబిడ్డ కవితను ఇంటి నుంచి గెంటేసిన నీచమైన చరిత్ర కేటీఆర్‌ది. కష్టాలలో జైలుకు పోయి ఇంటికి వచ్చిన ఆడబిడ్డ.. సాయం చేయమని కోరితే ఈ కర్కోటకుడు సొంత చెల్లెలినే ఇంట్లోంచి బయటికి గెంటేసిండు. చెడిపోయి పుట్టింటికి పోగూడదని పెద్దలు అంటరు.. కానీ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు.. తోడబుట్టిన చెల్లెలుకు సాయం చేయకుండా.. ఇంట్లోనుంచి గెంటేస్తే కన్నతండ్రి కండ్లు మూసుకొని ఉన్నడు.? కన్నతండ్రి దృతరాష్ట్రుడా..? కొడుకును పిలిచి సలాక కాల్చి.. వాతబెట్టి, వంగబెట్టి ఈపు మీద నాలుగు గుద్ది.. సగం ఆస్తి బిడ్డకు ఇయ్యాలె కదా..? కానీ ఇంట్లకెల్లి బయటికి గెంటేసిండు.
