మున్సిపల్ సిబ్బందితో పందుల పెంపకందారుల గొడవ 

మున్సిపల్ సిబ్బందితో పందుల పెంపకందారుల గొడవ 

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య పనుల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా పట్టణాన్ని అపరిశుభ్రం చేస్తున్న పందులను మున్సిపల్ సిబ్బంది పట్టే క్రమంలో పెంపకందారులు వారితో గొడవకు దిగారు. పందులను తరలిస్తున్న వాహనాలను ఆపి పురుగుల మందు డబ్బాలతో బెదిరింపులకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్దకు మహిళలతో కలిసి వచ్చి బైఠాయించేందుకు యత్నించారు. పందుల పెంపకం తమ హక్కు అని  మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో బలవంతంగా వారిని అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశాడు. డబ్బా మూత ఓపెన్ చేసి గడగడా తాగేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెందిరించే ప్రయత్నంలో భాగంగా ఆ వ్యక్తి ఆవు మూత్రం తాగి మందు సేవించినట్టు నటించినట్టు తెలుస్తోంది. 

పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పందులను తరలిస్తుండగా తమను అడ్డుకోవడం బాధాకరమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. పందులన్నీ వార్డుల్లో గుంపులుగా తిరుగుతూ పట్టణాన్ని అపరిశుభ్రం చేయడమే కాకుండా ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారని..ఇందులో భాగంగా పందుల తరలింపు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పందులను తరలించేందుకు పెంపకందారులకు గతంలో రెండుసార్లు సమయం ఇచ్చామని..అయినా వారిలో మార్పు రాకపోవడంతో తామే రంగంలోకి దిగామని స్పష్టం చేశారు. మరోసారి నెల రోజులు సమయమిచ్చామని ఆలోపు పందులను తరలించకపోతే వారిపై చర్యలుంటాయని కమిషనర్ హెచ్చరించారు.