షాద్ నగర్ లో దారుణం.. హత్యకు దారి తీసిన పసికందు కొనుగోలు వ్యవహారం

షాద్ నగర్ లో దారుణం.. హత్యకు దారి తీసిన పసికందు కొనుగోలు వ్యవహారం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిని కొన్న వ్యవహారం హత్యకు దారి తీసింది. షాద్ నగర్ ACP సుశాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ షాద్ నగర్ లోని పటేల్ రోడ్డులో నివాసముండే రాములు, శారద దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. ఆ చిన్నారికి మానసిక స్థితి సరిగ్గా లేకుండా జన్మించాడు. దీంతో రాములు దంపతులు తమకు మగ పిల్లాడు కావాలని వారి ఇంటి ఎదురుగా నివాసముంటున్న బీహార్ కు చెందిన పురుషోత్తం, దేవకి దంపతులకు చెప్పారు. అయితే వారి కొడుకును (6 నెలలు) అమ్మడానికి సిద్ధమయ్యారు పురుషోత్తం దంపతులు. ఈ మేరకు రూ.లక్షా యాభై వేలకు భేరం కుదుర్చుకున్న రాములు దంపతులు డబ్బులిచ్చి పిల్లాడ్ని తీసుకెళ్లారు.

అయితే కొన్ని రోజుల తర్వాత పురుషోత్తం భార్య దేవకి.. తనకు ఇచ్చిన డబ్బులు కాకుండా మరిన్ని డబ్బులివ్వాలని లేదా పిల్లాడిని తిరిగి ఇవ్వాలని రాములు దంపతులను తరచు వేధించేది. ఈ క్రమంలో మే 1వ తేదీ సోమవారం రాత్రి రాములు ఇంటికి వెళ్లిన దేవకి..డబ్బులు ఇస్తారా.. పిల్లాడిని తిసుకెళ్లాలా అంటూ గొడవకు దిగింది. దీంతో రాములుతో పాటు భార్య శరద, భార్య చెల్లెలు జ్యోతిలు కలిసి దేవకిని హత్య చేశారు. మృతదేహాన్ని బయట పడేసేందుకు గొనె సంచిలో తీసుకెళ్తుండగా పెట్రోలింగ్ పోలీసుల కంటపడ్డారు. అనుమానం వచ్చి వారిని అడ్డగించి సంచిలో చూడగా మహిళ శవం ఉన్నట్లుగా గుర్తించారు. రాములును అరెస్ట్ చేసి విచారించగా జరిగిన హత్య విషయం పోలీసులకు తెలిపాడు. వెంటనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.