- 12,760 పోస్టులతో కొత్త క్యాడర్ స్ట్రెంత్‌కు ప్రతిపాదనలు
- సర్కారు ఆమోదిస్తే సెక్రటరీలకు ప్రమోషన్లు
- పదేండ్ల తర్వాత కార్యదర్శుల కల సాకారమయ్యే చాన్స్
- ఏటా రూ.42.14 కోట్ల అదనపు భారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏండ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, పంచాయతీల సంఖ్య పెరగడంతో కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్‌ను సవరించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు పాత గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తూ.. ఆదాయమే ప్రాతిపదికన కొత్త గ్రేడ్లను ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కార్యదర్శులకు గ్రేడ్-1, 2, 3 హోదాల్లో పదోన్నతులు లభించనున్నాయి. గతంలో క్లస్టర్ల విధానంలో ఉన్న గ్రేడింగ్‌ను రద్దు చేసి, ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీని ఒక యూనిట్‌గా పరిగణించాలని భావిస్తోంది.
పెరగనున్న పోస్టుల సంఖ్య
తెలంగాణ ఆవిర్భావ సమయంలో 8,684 పంచాయతీలుండగా.. పునర్వ్యవస్థీకరణ తర్వాత 12,751కి పెరిగింది. ఆ తర్వాత కొత్తగా మరో 9 గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో రాష్ట్రంలో మొత్తం జీపీల సంఖ్య 12,760కి చేరింది. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి ఉండాలన్న నిబంధన మేరకు.. అన్ని పంచాయతీలకు గ్రేడింగ్ కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉన్న పోస్టుల సంఖ్యతో పోలిస్తే.. కొత్త గ్రేడింగ్ వల్ల పదోన్నతుల అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి.
గ్రేడ్- 1లో ప్రస్తుతం ఉన్న 478 పోస్టుల స్థానంలో 945 పోస్టులు రానున్నాయి. అంటే అదనంగా 467 మందికి గ్రేడ్-1 హోదా దక్కనుంది. గ్రేడ్- 2 లో ప్రస్తుతం 519 పోస్టులు ఉండగా.. కొత్తగా 1,258 పోస్టులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా 739 మందికి పదోన్నతి లభిస్తుంది. గ్రేడ్- 3లో ప్రస్తుతం 2,598 పోస్టులు ఉండగా.. వీటిని 3,769కి పెంచనున్నారు. దీనివల్ల 1,171 మందికి గ్రేడ్-3 హోదా లభిస్తుంది.
ఆదాయమే ప్రాతిపదిక
గతంలో ఐదారు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా పరిగణించి పంచాయతీ కార్యదర్శుల గ్రేడింగ్ ఇచ్చే పాత పద్ధతికి సర్కారు స్వస్తి పలకనుంది. ఇప్పుడు ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ పంచాయతీకి వచ్చే వార్షిక ఆదాయం ఆధారంగా కొత్త గ్రేడ్లను ఖరారు చేసింది. దీని ప్రకారం రూ.19 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న గ్రామాలను గ్రేడ్-1 కింద చేర్చి 945 పోస్టులను ప్రతిపాదించారు.
రూ.13 లక్షల నుంచి 19 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్-2 హోదా కల్పించి 1,258 పోస్టులు, రూ.7 లక్షల నుంచి 13 లక్షల లోపు ఆదాయం వచ్చే గ్రామాలకు గ్రేడ్-3 కింద 3,769 పోస్టులను కేటాయించారు. ఇక రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండే చిన్న గ్రామాలను గ్రేడ్- 4 పంచాయతీలుగా గుర్తించి, వాటి కోసం అత్యధికంగా 6,788 పోస్టులను నిర్ణయించారు. దీనివల్ల ప్రతి గ్రామానికి ఆదాయాన్ని బట్టి ఒక పర్మనెంట్ సెక్రటరీ హోదా దక్కనుంది.
ఖజానాపై ఏడాదికి రూ.42.14 కోట్లు అదనపు భారం
2020 పీఆర్సీ స్కేల్స్ ప్రకారం.. పదోన్నతులు కల్పిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. గ్రేడ్-1, 2, 3 కార్యదర్శులకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా బేసిక్ పే పెరుగుదలతోపాటు 30 శాతం డీఏ, 11 శాతం హెచ్‌ఆర్‌ఏలను పరిగణనలోకి తీసుకుంటే.. నెలకు రూ.3.51 కోట్ల అదనపు భారం పడుతుంది. ఏడాదికి రూ. 42.14 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనల ప్రకారం సీనియారిటీ ఆధారంగా పదోన్నతులను భర్తీ చేయనున్నారు.
