సీడ్ ప్రొడక్షన్ పెంచి నకిలీ విత్తనాలను అరికట్టండి : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

సీడ్ ప్రొడక్షన్ పెంచి నకిలీ విత్తనాలను అరికట్టండి :   రైతు కమిషన్  చైర్మన్ కోదండ రెడ్డి
  • అధికారులతో సమీక్షలో  రైతు కమిషన్  చైర్మన్ కోదండ రెడ్డి 

హైదరాబాద్​, వెలుగు: సీడ్ ఫార్మ్‌ల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మంగళవారం వ్యవసాయ శాఖ, రైతు కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి క్షేత్రాలపై సమీక్ష సమావేశం జరిగింది. 

రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో 8 చోట్ల సీడ్ ఫాంలు ఉన్నాయని, వీటిలో మొత్తం 1,629 ఎకరాల్లో వివిధ రకాల విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నదని అధికారులు కమిషన్‌కు వివరించారు. వరి, పెసర, జనుము, కందుల విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడారు. సీడ్ ఫాంల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, హద్దులు ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. 

భూ సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన భూములను కాపాడే బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోపాల్, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నర్సింగరావు, జాయింట్ డైరెక్టర్ సుచరిత, డీడీఏ నాగమల్లీశ్వరీ, ఏడీఏ ఉషారాణి, సీడ్ ఫార్మ్ అధికారులు వైద్యనాధ్, సక్రియ నాయక్, ఇంద్రసేన్, అనిల్ కుమార్, వాసు పాల్గొన్నారు.