- ఈసారి నీట్‌లో 35వేల మంది క్వాలిఫై
- 6,240కి చేరనున్న మొత్తం సీట్ల సంఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి ఈసారి 35, 148 మంది స్టూడెంట్స్ నీట్‌లో క్వాలిఫై అయ్యారు. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడంతో, ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ లక్ష దాటిన స్టూడెంట్స్‌కు కూడా సీటు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి రాష్ట్రంలో 1,200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. గతేడాది దాకా 5,040 ఉండగా, కొత్త సీట్లతో కలిపి ఈ సంఖ్య 6,240కు చేరుతోంది. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 2,940 సీట్లు ఉండగా, మిగిలినవి ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. అయితే, మహావీర్, ఎంఎన్‌ఆర్, టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీ పర్మిషన్‌ను ఎన్‌ఎంసీ ఇటీవల రద్దు చేసింది. ఈ అకాడమిక్ ఇయర్‌కు కూడా వాటి పర్మిషన్‌ను పునరుద్ధరించకపోతే 6,240 సీట్లలో నుంచి, 450 సీట్లు తగ్గే చాన్స్ ఉంటుంది.
కౌన్సెలింగ్ ఇలా..
గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని 85శాతం సీట్లను రాష్ట్రంలోని స్టూడెంట్స్‌కే కేటాయిస్తారు. ఇవన్నీ కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తారు. మిగిలిన 15శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. దేశంలోని ఏ ప్రాంత స్టూడెంట్స్అయినా, ఈ15శాతం సీట్లకు పోటీ పడొచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. వీటిని పూర్తిగా రాష్ట్రానికి చెందిన స్టూడెంట్లకే కేటాయిస్తారు. మిగిలిన 50శాతం సీట్లను మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద విభజించి భర్తీ చేస్తారు. వీటికి దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ అయినా పోటీ పడేందుకు చాన్స్ ఇస్తారు. గతేడాది ఈడబ్ల్యూఎస్ మినహా అన్ని కేటగిరీల్లోనూ ఆల్ ఇండియా ర్యాంక్ లక్ష దాటినా కన్వీనర్ కోటా సీట్లు వచ్చాయి.
టాప్ 50లో నలుగురే..
తెలంగాణ నుంచి ఈసారి 59,296 మంది నీట్ రాయగా, అందులో 59.27 (35,148) శాతం మంది క్వాలిఫై అయ్యారు. గతేడాది కంటే ఈసారి పాస్ పర్సంటేజ్ 4శాతం పెరిగింది. గతేడాది తెలంగాణ స్టూడెంట్లు టాప్ టెన్‌లో ముగ్గురు ఉండగా, ఈసారి ఒక్కరే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించగా, మొత్తం టాప్ 50లో మనోళ్లలో నలుగురికి మాత్రమే చోటు దక్కింది.
