విండ్​ పవర్​దే ఫ్యూచర్

విండ్​ పవర్​దే ఫ్యూచర్
  • రాబోయే రోజుల్లో 70 లక్షల కోట్ల వ్యాపారం

కరెంట్​.. చాలా ముఖ్యమైన విషయం మనకు. అది లేనిదే పని సాగదు. ఇంటి అవసరాల దగ్గర్నుంచి కంపెనీలు, ఫ్యాక్టరీల పనుల వరకూ అదే ఇంధనం. అలాంటి కరెంట్​ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది బొగ్గు నుంచే. కానీ, దాని వల్ల పర్యావరణానికి పెద్ద నష్టమే జరుగుతోంది. కార్బన్​ డయాక్సైడ్​ వంటి గ్రీన్​హౌస్​ గ్యాస్​లు గాల్లో కలిసి వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి. అందుకే సైంటిస్టులు సోలార్​ (సౌర), విండ్​ (గాలి) వంటి రెన్యువబుల్​ (పునరుత్పాదక) ఎనర్జీ వైపు చూడాలని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా ఇంటర్నేషనల్​ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) కూడా ఇదే విషయం చెబుతోంది. కాకపోతే రాబోయే రోజుల్లో విండ్​ పవర్​ (గాలి నుంచి కరెంట్​ తయారీ)దే ఫ్యూచర్​ అని చెప్పింది. అది కూడా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఎక్కువ విండ్​ పవర్​ తయారవుతుందని తెలిపింది. ఇటీవల ఐఈఏ దీనిపై ఓ రిపోర్టును తయారు చేసింది. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ టెంపరేచర్లను 2 డిగ్రీల మేర తగ్గించాలంటే సముద్ర తీర ప్రాంతాల్లో విండ్​ పవర్​ను తయారు చేయడమే మేలని, ప్రపంచ అవసరాలను తీర్చాలన్నా మంచి మార్గమని చెప్పింది.

రూ.70 లక్షల కోట్ల వ్యాపారం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న కరెంట్​లో సముద్ర తీరాల్లో తయారవుతున్న విండ్​పవర్​ వాటా 0.3 శాతం. వచ్చే రెండు దశాబ్దాల్లో (20 ఏళ్లు) అది 15 రెట్లు పెరుగుతుందని ఐఈఏ స్టడీ తేల్చింది. ఈ విండ్​ పవర్​ బిజినెస్​ విలువ 70 లక్షల కోట్ల రూపాయల (లక్ష కోట్ల డాలర్లు)పైనే ఉంటుందని చెప్పింది. గత ఏడాది ఒక్క గిగావాట్​ విండ్​ పవర్​ ప్రాజెక్ట్​లను ఏర్పాటు చేయడానికి దాదాపు ₹28,286 కోట్ల (400 కోట్ల డాలర్లు) మేర ఖర్చయిందని, కానీ, కొత్త విండ్​ టర్బైన్​ల టెక్నాలజీలతో ఆ ఖర్చు మున్ముందు భారీగా తగ్గుతుందని పేర్కొంది. వచ్చే పదేళ్లలో దాదాపు 40 శాతం మేర ఖర్చు తగ్గుతుందని వివరించింది. యూరప్​లో సంప్రదాయ కరెంట్​ తయారీ ఖర్చులతో పోలిస్తే విండ్​ పవర్​ ఖర్చు భారీగా తగ్గుతోందని చెప్పింది. 2030 నాటికి చైనాలోనూ వీటికి డిమాండ్​ పెరుగుతుందని తెలిపింది.

రాజకీయంగా డెడికేషన్​ అవసరం

ప్రస్తుత సంప్రదాయ కరెంట్​ తయారీ పద్ధతులను ఇలాంటి పర్యావరణ హిత పద్ధతులతో రిప్లేస్​ చేయాలంటే రాజకీయంగా కొంచెం డెడికేషన్​ చూపించాల్సిన అవసరం ఉందని ఐఈఏ సూచించింది. ‘‘గత పదేళ్లలో కరెంట్​ తయారీలో టెక్నాలజీ పరంగా రెండు పెద్ద మార్పులు జరిగాయి. అది షేల్​ రెవల్యూషన్​, సౌర ఫలకాలు. ప్రారంభంలో వాటికి కొంచెం ఖర్చు ఎక్కువే అయినా, డిమాండ్​ పెరుగుతున్న కొద్దీ వాటి ఖర్చూ భారీగా తగ్గిపోయింది. మున్ముందు విండ్​ పవర్​ కూడా ఈ జాబితాలో చేరుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో విండ్​ పవర్​కు డిమాండ్​ ఎక్కువగానే ఉంది. అయితే, వివిధ దేశాల ప్రభుత్వాలు దీనిపై కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా డెడికేషన్​ చూపించాల్సి ఉంది. పర్యావరణానికి హాని చేయని కరెంట్​ కావాలంటే ఆ మాత్రం నిబద్ధత ఉండాలి” అని ఐఈఏ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ఫతీ బిరోల్​ అన్నారు. కాగా, తొలిసారిగా 1991లో డెన్మార్క్​ విండ్​ పవర్​ టర్బైన్​లను ఏర్పాటు చేసింది. గత ఏడాది ఆ దేశం ఉత్పత్తి చేసిన మొత్తం కరెంట్​లో 15 శాతం కరెంట్​ తీరాల్లో ఏర్పాటు చేసిన టర్బైన్ల నుంచే తయారైంది. ప్రస్తుతం విండ్​ పవర్​లో బ్రిటన్​ నెంబర్​ వన్​ స్థానంలో ఉంది. ప్రస్తుతం వివిధ దేశాల్లోనూ విండ్​ పవర్​కు డిమాండ్​ పెరుగుతోంది.

ఇండియాలో బొగ్గు డిమాండ్ తగ్గుతోంది

ఇండియాలో ప్రస్తుతం బొగ్గు నుంచే ఎక్కువ కరెంట్​ తయారవుతోంది. అయితే, ఈ ఏడాది అది బాగా తగ్గిపోయింది. హైడ్రో (జల విద్యుత్​), సోలార్​, న్యూక్లియర్​ పవర్​ తయారీ పెరుగుతోంది. అక్టోబర్​ చివరి నాటికి వాటి వాటా 24 వేల గిగావాట్​అవర్​గా ఉంది. అంటే మొత్తం కరెంట్​లో వాటా 8.4 శాతం. జులైలో బొగ్గు కరెంటే ఎక్కువగా ఉన్నా, ఆగస్టులో కొంచెం తగ్గింది. సెప్టెంబర్​, అక్టోబర్​ నాటికి బాగా పడిపోయింది. ఇనిస్టిట్యూట్​ ఫర్​ ఎనర్జీ ఎకనామిక్స్​ అండ్​ ఫైనాన్షియల్​ అనాలిసిస్​లో ఈ విషయం తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బొగ్గు కరెంట్​ తయారీ 12,500 గిగావాట్​ అవర్​ తగ్గిందని ఆ సంస్థ రీసెర్చర్​ చార్లీ వోరింగ్​హాం అన్నారు.