IND vs AFG: సూపర్ ఓవర్‌‌‌లో గట్టెక్కిన టీమిండియా.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్

IND vs AFG: సూపర్ ఓవర్‌‌‌లో గట్టెక్కిన టీమిండియా.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్

చిన్నస్వామి వేదికగా అఫ్ఘనిస్తాన్‌‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత జట్టు రెండోసారి సూపర్ ఓవర్‌లో గట్టెక్కింది. తొలుత నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు(212) సమం కావడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్‌ నిర్వహించగా.. మళ్లీ అదే జరిగింది. సూపర్ ఓవర్‌‌లోనూ స్కోర్లు సమం(16) అయ్యాయి. దీంతో రెండోసారి సూపర్ ఓవర్ నిర్వహించగా.. టీమిండియా విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక మ్యాచ్ రెండు సార్లు సూపర్ ఓవర్‌‌కు దారితీయడం ఇదే తొలిసారి. 

రోహిత్ శతకం

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ(121 నాటౌట్‌; 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‪లు) శతకానికి తోడు రింకూ సింగ్(69; 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‪లు) అర్ధ శతకం బాదాడు. యశస్వి జైస్వాల్(4), శివమ్ దూబే(1) సింగిల్ డిజిట్ కే పరిమితమవ్వగా.. విరాట్ కోహ్లీ(0), సంజు శాంసన్(0) ఖాతా తెరవలేదు. 

గుర్బాజ్- జద్రాన్ జోరు

అనంతరం 213 పరుగుల భారీ ఛేదనకు దిగిన అఫ్ఘన్‌కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్(50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‪లు), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‪) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. అనంతరం వీరిద్దరూ వెనుదిరగాక అఫ్ఘనిస్తాన్‌‌ వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది.  అయితే, చివరలో గుల్బాదిన్ నయిబ్(24; 13 బంతుల్లో2 ఫోర్లు, 3 సిక్స్‪లు)- మహమ్మద్ నబీ(34; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‪లు) జోడి కాసేపు భారత బౌలర్లను భయపెట్టారు. సిక్సర్ల వర్షం కురిపించారు. ఆఖరి వరకూ పోరాడిన గుల్బాదిన్ జట్టు స్కోర్లు సమం చేశాడు. దీంతో సూపర్ ఓవర్‍ కు దారి తీసింది. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.

తొలిసారి సూపర్ ఓవర్‌లో ఇరు జట్ల స్కోర్లు:

  • అఫ్గనిస్తాన్: 16/1
  • టీమిండియా: 16/1

రెండోసారి సూపర్ ఓవర్‌లో ఇరు జట్ల స్కోర్లు:

  • టీమిండియా : 11/2
  • అఫ్గనిస్తాన్:  1/2