వీడియో: అఫ్ఘన్ క్రికెటర్‌తో రోహిత్ వాగ్వాదం.. ఇందులో తప్పెవరిది..?

వీడియో: అఫ్ఘన్ క్రికెటర్‌తో రోహిత్ వాగ్వాదం.. ఇందులో తప్పెవరిది..?

బుధవారం చిన్నస్వామి వేదికగా భారత్, అప్ఘానిస్థాన్ మధ్య జరిగిన ఆఖరి టీ20 చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠను తలపించిన విషయం తెలిసిందే. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం కోసం ఏకంగా రెండో సూపర్ ఓవర్‌ వరకు దారి తీసింది. చివరకు టీమిండియా రోహిత్ శర్మ నాయకత్వం, రవి బిష్ణోయ్ మాయాజాలంతో టీమిండియా రెండో సూపర్ ఓవర్లో గట్టెక్కింది. ఇది మ్యాచ్‌లో సగ భాగం మాత్రమే. ఇంకో సగ భాగం వేరే ఉంది.

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకానొక సమయంలో సహనం కోల్పోయాడు. అప్ఘానిస్థాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీతో వాగ్వాదానికి దిగాడు. చివరకు అంపైర్ జోక్యంతో వీరిద్దరి గొడవ సద్దుమణిగింది. 

ఏం జరిగిందంటే..?

మొదట ఇరు జట్ల స్కోర్లు స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. ఇక్కడే వివాదం మొదలైంది. ఆఖరి బంతిని నబీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది బ్యాట్‌ని తగలకుండా నేరుగా కీపర్ సంజూ శాంసన్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో నబీ బై కోసం పరుగెత్తగా.. శాంసన్ రనౌట్ కోసం బౌలర్ వైపు త్రో విసిరాడు. అది వెనుక నుండి నబీ ప్యాడ్‌కు లాంగ్ ఆన్ వైపు దూసుకెళ్లింది. దీంతో ఆఫ్ఘన్ జట్టుకు మరో రెండు పరుగులు అదనంగా లభించాయి. ఇక్కడే రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చింది. 

'బంతి నీ ప్యాడ్ తగిలి వెళ్తోంది.. ఎలా పరుగులు వస్తాయనుకుంటున్నావ్..' అంటూ రోహిత్.. నబీతో వాగ్వాదానికి దిగాడు. అందులో తన తప్పేమి లేదని నబీ అతన్ని సముదాయించే ప్రయత్నం చేశాడు. చివరకు అంపైర్‌.. నబీ, ఉద్దేశపూర్వకంగా త్రో లైన్‌లోకి రాలేదని, అందువల్ల పరుగులు తీసే హక్కు అతనికి ఉందని సూచించినడంతో రోహిత్ శాంతించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తప్పెవరిది..?

ఈ ఘటనలో రోహిత్ అసహనాన్ని పాకిస్తాన్ అభిమానులు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భారత క్రికెటర్లకు రూల్స్ తెలియవా అంటూ నోటికొచ్చింది వాగుతున్నారు. ఒక జట్టు సారథిగా అబ్ స్ట్రక్షన్ ఫీల్డ్ పై అప్పుల్ చేసుకోవచ్చేనే కనీస జ్ఞానం లేకుండా కామెంట్లు పెడుతున్నారు. రెండు సూపర్ ఓవర్లలోనూ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడాన్ని కూడా వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.