కొంచెం తగ్గి ఉండాలి.. సిరాజ్ వైఖ‌రిపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం

కొంచెం తగ్గి ఉండాలి.. సిరాజ్ వైఖ‌రిపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం

భారత పేసర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ వైఖ‌రిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మాజీ ఆటగాళ్లతో పాటు నెటిజన్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆటగాళ్ల మధ్య కవ్వింపులు, స్లెడ్జింగ్ కామన్ అయినప్పటికీ.. అది పరిధికి లోబడి ఉండాలని సూచిస్తున్నారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆట రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ వైపు సిరాజ్ బంతిని విసిరేయడమే అందుకు కారణం. ఆ ఘ‌ట‌నపై మాజీ దిగ్గజ క్రికెటర్లు సునీల్ గ‌వాస్క‌ర్‌, ర‌విశాస్త్రిలు స్పందించారు. సిరాజ్ ప్రవర్తన త‌మ‌ను నిరుత్సాహ‌ప‌రిచిన‌ట్లు కామెంట‌రీలో వెల్లడించారు. 

ఆట ప్రారంభ‌మై రెండు మూడు బంతులు కాలేదు అప్పుడే ఇదేంట‌ని గ‌వాస్క‌ర్ త‌న అసహనాన్ని వెళ్లబుచ్చాడు. ఇక మాజీ కోచ్ ర‌విశాస్త్రి కూడా సిరాజ్ వైఖరిని ప్ర‌శ్నించాడు. బంతి ప‌డ‌డానికి ముందు ప‌క్క‌కు జ‌రిగే హ‌క్కు బ్యాటర్‌కు ఉంటుందని సూచించాడు. ఈ ఘటన జరగడానికి ముందు స్మిత్ రెండు బౌండ‌రీలు కొట్టాడని.. అది సిరాజ్‌లో అస‌హ‌నం క‌నిగించింద‌ని రవిశాస్త్రి త‌న కామెంట‌రీలో తెలిపాడు. అభిమానులు సైతం సిరాజ్ ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అతన్ని రెచ్చగొట్టడం వల్ల జట్టుకు నష్టమే తప్ప లాభం ఉండదని సూచిస్తున్నారు.

జరిగింది ఏంటంటే..?

రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 86 ఓవర్‌లో సిరాజ్‌ మూడో బంతిని వేసేందుకు సిద్ధమయ్యాడు. రనప్‌ పూర్తవ్వగా బంతిని విసిరే చివరి సమయంలో స్మిత్‌ క్రీజు నుంచి పక్కకు వెళ్లాడు. అది సిరాజ్‌కు కోపం తెప్పించింది. బంతిని ఆపకుండా వికెట్ల వైపు కోపంగా విసిరాడు. ఈ ఘటన పట్ల స్మిత్ తో పాటు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా షాకయ్యాడు. మైదానంలోని స్పైడర్‌ కెమెరా అడ్డురావడంతోనే క్రీజు నుంచి పక్కకు జరిగినట్లు స్మిత్‌ వివరణ ఇచ్చాడు. వీరిద్దరి గొడవకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.