IND vs ENG: నేను వీసా ఆఫీసులో కూర్చోను.. మీడియాపై రోహిత్ కౌంటర్లు

IND vs ENG: నేను వీసా ఆఫీసులో కూర్చోను.. మీడియాపై రోహిత్ కౌంటర్లు

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ ప్రారంభానికి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా మిత్రులపై కౌంటర్లు వేశారు. వీసా జాప్యం కారణంగా ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బ్రిటన్‌ తిరిగి వెళ్ళిపోయిన విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రస్తావించగా.. అతను మరో ప్రశ్న అడగకుండా ఉండేలా సమాధానమిచ్చారు. 

వీసా రాకపోవడంతో అబుదాబి నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లిన అన్‌క్యాప్డ్ ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ పట్ల రోహిత్ శర్మ సానుభూతి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ సమస్య త్వరగా పరిష్కారమై అతను ఇండియాకు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

"షోయబ్ బషీర్‌కు జరిగిన దాని పట్ల నేను చింతిస్తున్నా. అతను వస్తాడని నేను అనుకున్నా., కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయాడు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి నేను వీసా కార్యాలయంలో కూర్చోవడం లేదు. అతను త్వరలోనే వీసా పొంది మన దేశానికి వస్తారని ఆశిస్తున్నాను.." అని రోహిత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోహిత్ నోట ఈ సమాధానం వినగానే అక్కడున్న మీడియా మిత్రులందరూ చిరునవ్వులు చిందించారు.

ఎవరీ షోయబ్ బషీర్..?  

భారత పర్యటనకు ఎంపిక చేసిన ఇంగ్లాండ్ జట్టులో షోయబ్ బషీర్ ఒకరు. ఇతను ఆఫ్ స్పిన్నర్. కౌంటీ క్రికెట్‌లో సోమర్‌సెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ 20 ఏళ్ల కుర్రాడు తన బౌలింగ్ యాక్షన్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఉపఖండ పిచ్‌లపై రాణించగలడనే నమ్మకంతో సెలెక్టర్లు అతనికి చోటు కల్పించారు.

పాకిస్తాన్ వారసత్వానికి చెందిన బషీర్.. గత నెల రోజులుగా భారత వీసా కోసం కష్టపడుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు ఇండియా పర్యటన కోసం భారత్‌కు బయలుదేరే ముందు వరకూ అతను ఇంగ్లండ్ జట్టుతో కలిసి శిక్షణ శిబిరంలోనే ఉన్నాడు. చివరి నిమిషంలో వీసా జారీ ఆల‌స్యం కావ‌డంతో అతను అబుదాబిలోనే ఉండిపోయాడు. అనంతరం వీసా సమస్యపై త్వరగతిన పరిష్కారం లభించకపోవడంతో అతను స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.