ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అంతే మరీ: టికెట్ సేల్ మొదలైన నిమిషాల్లోనే BookMyShow క్రాష్

ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అంతే మరీ: టికెట్ సేల్ మొదలైన నిమిషాల్లోనే BookMyShow క్రాష్

న్యూఢిల్లీ: ఇండియా-పాక్ మ్యాచ్‎కు ఉండే క్రేజ్ వేరే లెవల్. ప్రపంచ క్రికెట్లో ఏ మ్యాచ్‎కు లేని హైప్ ఈ మ్యాచ్‎కు ఉంటుంది. కేవలం ఇండియా, పాక్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచును వీక్షిస్తారు. ఈ క్రమంలోనే దాయాదుల సమరానికి ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువైంది. 2026, ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికలుగా సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా టికెట్ బుకింగ్ ఫ్లాట్‎ఫామ్ బుక్ మై షోలో టీ20 వరల్డ్ కప్ రెండో దశ టిక్కెట్ల అమ్మకాలు బుధవారం (జనవరి 14) ప్రారంభమయ్యాయి. దీంతో 2026, ఫిబ్రవరి 15న జరగనున్న ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒకేసారి చాలా మంది టికెట్లు కొనడానికి ప్రయత్నించడంతో నిమిషాల్లోనే బుక్ మై షో వైబ్ సైట్ క్రాష్ అయ్యింది. టికెట్ సేల్ మొదలైన నిమిషాల్లోనే భారీగా ఫ్యాన్స్ ఎగబడటంతో సర్వర్లపై తీవ్ర ఒత్తడి నెలకొని సైట్ క్రాష్ అయ్యింది. దీంతో ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అంతే మరీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

2026 టీ20 వరల్డ్ కప్‎ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్‎లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. 

ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్  ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. 

ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్‎లో  భాగం కానున్నాయి. 

పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా, పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు క్షీణించాయి. గ్రౌండ్ లో ఇరుజట్ల ఆటగాళ్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. ఇండియా ఆసియా కప్ గెలిచినప్పటికీ.. పాక్ వ్యక్తి ఏసీసీ చైర్మన్ గా ఉండటంతో అతడి చేతుల మీదుగా టోర్నీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరీ టీ20 వరల్డ్ కప్ లోనైనా షేక్ హ్యాండ్ వివాదానికి ముగింపు పలుకుతారా..? లేక పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తారా చూడాలి. 


.