
సోలో (ఇండోనేషియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో ఇండియా110–83తో యూఏఈపై నెగ్గింది. గర్ల్స్ సింగిల్స్‌లో రుజులా రాము 11–5తో మైషా ఖాన్‌పై గెలవగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో లాల్‌రమ్సంగ–తారిణి సూరి 22–11తో విజయం సాధించారు. మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆధిపత్యం చూపెట్టిన ఇండియా హాఫ్ టైమ్ వరకు 55–41తో ఆధిక్యంలో నిలిచింది.
యూఎస్ ఓపెన్ ఫైనలిస్ట్ తన్వి శర్మ.. మధుమిత సుందరపాండియన్‌ను ఓడించడంతో ఇండియా లీడ్ 66–46కు పెరిగింది. రేషికాతో జత కట్టిన లాల్‌రమ్సంగ సెకండ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో 11–5తో ఆదిత్య కిరణ్–మైషా ఖాన్‌పై గెలవడంతో స్కోరు 77–51కి పెరిగింది. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగించిన ఇండియా ఈజీగా విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రూప్–డి టాప్ ప్లేస్ కోసం ఇండియా ఆదివారం హాంకాంగ్‌తో తలపడనుంది.