బిహార్ కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు .. అందుకే ఈసీ ద్వారా ఎస్ఐఆర్ చేపట్టింది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

బిహార్ కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు .. అందుకే ఈసీ ద్వారా ఎస్ఐఆర్ చేపట్టింది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • రాహుల్ సారథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన
  • పాల్గొన్న తెలంగాణ ఎంపీలు వంశీ, చామల తదితరులు

న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ అధికారం కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ చిల్లర రాజకీయాలు చేస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. ఇందులో భాగంగానే ఎన్నికల సంఘం(ఈసీ) ద్వారా ఆ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈఎస్ఐఆర్ విధానంతో తమ అనుకూలంగా ఓటర్ల జాబితాలో సవరణలకు ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఈ విధానం సరైనదే అయితే.. లోక్ సభ ఎన్నికల ముందు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 

బిహార్​లో ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంట్ ఆవరణలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రారంభానికి ముందు మకర ద్వారం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ఆందోళన వంశీకృష్ణ, చామల, మల్లు రవి రాష్ట్రానికి చెందిన ఇతర కాంగ్రెస్ ఎంపీలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం ఈ రివిజన్ ఉద్దేశం, చట్టబద్ధతను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గడ్డం వంశీ మాట్లాడుతూ.. దేశంలో నియంతృత్వ పాలన సాగుతున్నదని విమర్శించారు. ఈ రివిజన్​ ద్వారా బీజేపీకి ఓటు వేసే వారిని జాబితాలో ఉంచి, వ్యతిరేకంగా ఉన్న వారిని తొలగించే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కేంద్రానికి మద్దతుగా చేస్తున్న ఈ పనులను దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలు చూపితే చాలని సుప్రీంకోర్టు చెప్పినా.. రివిజన్ చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ విధానాన్ని బిహార్ తో ప్రారంభించి... రేపు దేశంలో ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ అమలు చేస్తారని ఆరోపించారు.

ప్రజాస్వామ్య రక్షణకే కాంగ్రెస్

ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పోరాడుతున్నదని వంశీకృష్ణ అన్నారు. ఆపరేషన్ సిందూర్, ఆ తదుపరి పరిణామాలపై దేశ ప్రజలకు నిజం తెలిపేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మందునుంచి డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కానీ ఇందుకు కేంద్రం అనుమతివ్వలేదని, ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లోనూ చర్చకు పట్టుబడితే కేంద్ర ముఖం చాటేస్తోందని విమర్శించారు. చర్చకు లోక్ సభ ప్రతిపక్ష నేతకే అనుమతివ్వక పోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. 

మరోవైపు ఉదయం హౌస్​లో ఆహ్లాదంగా కనిపించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్, సాయంత్రానికి అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. అవసరానికి వాడుకోవడం, అది తీరగానే ఏవో కారణాలు చూపి వదిలేయడం బీజేపీకి అలవాటేనని విమర్శించారు.