
ఆసియా కప్ కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోసిన్ నఖ్వీ శనివారం (జూలై 26) ప్రకటించారు. ఈ ఏడాది ఆసియా కప్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ టోర్నీ ఆడుతుంది 8 దేశాలైనా అందరి చూపు ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ మీద ఉంది. ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత తొలిసారి ఇండో–పాక్ గ్రౌండ్‌లో ఢీకొట్టనున్నాయి. రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉంచడంతో కనీసం ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ చూడొచ్చు.
ALSO READ | WCL 2025: పాక్ సెమీస్‌కు వచ్చినా ఆడేది లేదు.. తేల్చి చెప్పిన టీమిండియా ఓపెనర్
మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. టీమిండియా సెప్టెంబర్ 10న యూఈఏతో, 14న పాకిస్తాన్‌తో, 19న ఒమన్‌తో పోటీపడనుంది. గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్థాన్ సూపర్-4 కు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే గ్రూప్ లో బలహీనమైన ఒమాన్, యూఏఈ కూడా ఉండడంతో రెండు జట్లు సూపర్-4కు చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
సూపర్-4 లో బాగా ఆడి ఇండియా, పాకిస్థాన్ టాప్-2 లో ఉంటే ఫైనల్లో దాయాదుల మధ్య మరోసారి పోరు చూడవచ్చు. దీంతో మొత్తం మూడు సార్లు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకి కలగనుంది. తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టోర్నీ మ్యాచ్ లన్నీ జరుగుతాయి. ఆసియా కప్‌కు ఆతిథ్య హక్కులు ఇండియాకే లభించినా.. ఇండో–పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికపై జరిగేలా బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా టోర్నీని యూఏఈలో నిర్వహిస్తున్నారు. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.