
- ప్రస్తుతం 20 శాతమే
- కనీసం 51 శాతం వాటా ప్రభుత్వ కంట్రోల్లో ఉండేలా ప్లాన్
- అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా మార్చేందుకు త్వరలో సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) గరిష్ట పరిమితిని ప్రస్తుతం ఉన్న 20 శాతం నుంచి పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీంతో బ్యాంకులు పెట్టుబడులు సేకరించడం మరింత ఈజీ అవుతుంది. అలాగే అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా ఎదగడానికి వీలుకుదురుతుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో గవర్నమెంట్ వాటా 51 శాతం కంటే తగ్గదని సంబంధిత అధికారి అన్నారు. త్వరలో ప్రతిపాదించే ఆర్థిక సంస్కరణల ప్యాకేజీలో భాగంగా ఈ చర్యలు తీసుకోనున్నారని తెలిపారు. ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అంటే వీటిలో ప్రభుత్వం వాటా 51 శాతం కంటే ఎక్కువ ఉంది.
తాజా వార్తలతో ఇండియా స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో కదిలినా, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మాత్రం గణనీయంగా పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తమ 52 వారాల గరిష్ట స్థాయిని చేరాయి. మార్నింగ్ సెషన్‌లో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.2 శాతం ర్యాలీ చేసింది. కానీ, చివరికి నష్టాల్లో ముగిసింది. ‘‘బ్యాంకులు ఫైనాన్షియల్‌గా బలంగా ఉన్నాయి. వీటి మొండిబాకీలు తగ్గాయి. లాభాలు పెరగడంతో ఇవి ఇచ్చే డివిడెండ్లు కూడా పెరిగాయి. విదేశీ పెట్టుబడి పరిమితి పెంపు వార్తలు పెట్టుబడిదారుల కాన్ఫిడెన్స్‌ను పెంచాయి” అని ఎనలిస్టులు పేర్కొన్నారు.
ప్రైవేట్ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ లిమిట్ 74 శాతం
ప్రస్తుతం పీఎస్‌బీల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డీఐ) పరిమితి 20 శాతంగా, ఓటింగ్ హక్కుల పరిమితి 10 శాతంగా ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఇది 74 శాతం వరకు ఉంది. ప్రభుత్వం తమ వాటా 51 శాతం కంటే తగ్గదని స్పష్టం చేసింది. నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉండేలా ప్లాన్ చేయనుంది. ఆర్థిక కార్యదర్శి ఎం. నాగరాజు మాట్లాడుతూ, ‘‘పీఎస్‌బీలు ఇప్పుడు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. ఇన్నోవేషన్‌పై ఫోకస్ పెట్టాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని చేరేందుకు, ప్రపంచ స్థాయి పోటీతత్వం, గవర్నెన్స్, ఆపరేషనల్ రెజిలియన్స్ అవసరం”అని ఆయన పేర్కొన్నారు.
మెరుగైన పరిస్థితి
ఇటీవల సంవత్సరాల్లో పీఎస్‌బీల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగైంది. గ్రాస్ నాన్పె ర్ఫార్మింగ్ అసెట్స్ (జీఎన్‌పీఏ) రేషియో 2021 మార్చిలో 9.11 శాతం నుంచి 2025 మార్చిలో 2.58 శాతానికి తగ్గింది. నికర లాభాలు రూ.1.04 లక్ష కోట్ల నుంచి రూ.1.78 లక్ష కోట్లకు, డివిడెండ్ చెల్లింపులు రూ.20,964 కోట్ల నుంచి రూ.34,990 కోట్లకు పెరిగాయి.
ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో గవర్నమెంట్ వాటా..
బ్యాంక్ పేరు వాటా (శాతాల్లో)
ఎస్‌బీఐ 57.59
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 73.00
బ్యాంక్ ఆఫ్ బరోడా 63.97
బ్యాంక్ ఆఫ్ ఇండియా 73.38
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 79.06
యూనియన్ బ్యాంక్ 74.76
కెనరా బ్యాంక్ 62.93
సెంట్రల్ బ్యాంక్ 93.08
ఇండియన్ బ్యాంక్ 73.84
ఇండియన్ ఓవర్‌సీస్ 96.61
పంజాబ్ అండ్ సింధ్ 98.25
యూకో బ్యాంక్ 90.95