గుడ్ న్యూస్.. ఇక UPI పేమెంట్స్కు ఇంటర్నెట్ అవసరం లేదు !

గుడ్ న్యూస్.. ఇక UPI పేమెంట్స్కు ఇంటర్నెట్ అవసరం లేదు !

మన దేశంలో నగదు లావాదేవీల విషయంలో మరో విప్లవాత్మక మార్పు రానుంది. త్వరలోనే ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం అంతంత మాత్రంగా ఉన్న గ్రామాల్లో ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అనుకూలంగా ఆఫ్ లైన్ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇందుకు సంబంధించిన ఒక కొత్త ఫీచర్ను డెవలప్ చేస్తుంది. యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే యూపీఐ లావాదేవీలను పూర్తి చేయడానికి వీలు కల్పించే ఒక కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఎలా పనిచేస్తుందంటే.. ఈ వ్యవస్థ మొత్తం UPI లైట్ నుంచి పనిచేస్తుంది. తక్కువ చెల్లింపుల కోసం మీ ఫోన్‌లో ఉండే ఒక వాలెట్ లాంటిది. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు UPI లైట్‌ వ్యాలెట్లోకి డబ్బును లోడ్ చేయాలి. ఇది కేవలం ఒక త్వరిత టాప్-అప్ మాత్రమే. ఆ తర్వాత.. స్టోర్‌లోని NFC-కి సపోర్ట్ చేసే టెర్మినల్ దగ్గర మీ ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్‌లో పేమెంట్ చేయొచ్చు. ఇందుకు.. UPI పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. చెల్లింపు కూడా వేగంగా పూర్తవుతుంది.

అయితే ఈ ఆఫ్ లైన్ లావాదేవీలకు పరిమితి ఉంది. ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్స్లో ఒక్కో లావాదేవీకి రూ. 2 వేల వరకు మాత్రమే చెల్లించగలిగే అవకాశం ఉంది. సిగ్నల్ సరిగా లేని మారుమూల గ్రామాలు, భూగర్భ మెట్రో స్టేషన్లు, విమానాలు, నెట్‌వర్క్ అంతరాయం ఉండే ప్రాంతాల్లో ఇబ్బంది పడకుండా చెల్లింపులు చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.