భారత్ దెబ్బకి 55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదేనంటున్న పాకిస్థాన్ కోచ్!

భారత్ దెబ్బకి 55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదేనంటున్న పాకిస్థాన్ కోచ్!

IND vs PAK: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ హెడ్ కోచ్ వాహబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. శనివారం దుబాయ్ వేదికగా జరిగిన పోరులో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం ప్రెస్ మీట్‌లో మాట్లాడిన వాహబ్ రియాజ్, ఈ ఆసియా కప్ ట్రోఫీని గెలిచేందుకు పాకిస్తానే అత్యుత్తమ జట్టు అని నేను ఇప్పటికీ నమ్ముతున్నానని వ్యాఖ్యానించాడు. యుఏఈ పరిస్థితులు తమ జట్టుకు బాగా అనుకూలిస్తాయని, భారత్ చేతిలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని త్వరలోనే మర్చిపోయి బౌన్స్ బ్యాక్ అవుతామని ధీమా వ్యక్తం చేశాడు.

భారత బౌలర్ల ధాటికి పాక్ చుట్టేసింది: 

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది, ఇది అంతర్జాతీయ టీ20ల్లో పాక్‌కు అత్యల్ప స్కోరు. ఓపెనర్లు మునీబా అలీ, షవాల్ జుల్ఫికర్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా మిగిలిన బ్యాటర్లంతా భారత బౌలర్ల ధాటికి క్యూ కట్టారు. భారత్ తరఫున శ్రీ చరణి 3 వికెట్లతో విరుచుకుపడగా, దీప్తి శర్మ, ప్రేమా రావత్ చెరో 2 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు. అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 68 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 8.4 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని నమోదు చేసుకుంది. 

సనా మీర్ విమర్శలకు కౌంటర్: 

టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్తాన్ జట్టులో ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను మార్చడంపై మాజీ కెప్టెన్ సనా మీర్ చేసిన విమర్శలపై కూడా వాహబ్ రియాజ్ స్పందించాడు. జట్టు ఓవర్‌హాల్‌ను సమర్థిస్తూ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేశాం.. ఇంతకుముందు ఆడిన సీనియర్ ప్లేయర్స్ ఎన్నో ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లు ఆడినా ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే రాబోయే టోర్నమెంట్ల కోసం కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి బలమైన జట్టును నిర్మించాల్సిన సమయం వచ్చిందన్నాడు. 

సెమీస్ అవకాశాలు సంక్లిష్టం: 

గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత జట్టు ఇప్పటికే అధికారికంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో థాయిలాండ్‌తో సమానంగా ఉన్న పాక్, నాకౌట్ రేసులో నిలవాలంటే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. భారత్ చేతిలో ఎదురైన పరాభవాన్ని పక్కనపెట్టి తర్వాతి మ్యాచ్‌పై దృష్టి సారిస్తామని కోచ్ వాహబ్ రియాజ్ తెలిపాడు.