జూనియర్‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో నిరాశ పర్చిన ఇండియా

జూనియర్‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో నిరాశ పర్చిన ఇండియా

చెన్నై: ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ మెన్స్‌‌‌‌ జూనియర్‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా నిరాశపర్చింది. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో 1–5 తేడాతో ఏడుసార్లు చాంపియన్‌‌‌‌ జర్మనీ చేతిలో ఓడింది. ఫలితంగా 2016 తర్వాత మరోసారి చాంపియన్‌‌‌‌గా నిలవాలన్న హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఆశలు నెరవేరలేదు. ఇండియా తరఫున ఎక్కా అన్మోల్‌‌‌‌ (50వ ని) ఏకైక గోల్‌‌‌‌ కొట్టగా, లుకాస్‌‌‌‌ కోసెల్‌‌‌‌ (14, 30వ ని), టిటాస్‌‌‌‌ వెక్స్‌‌‌‌ (15వ ని), జొనాస్‌‌‌‌ జెర్సమ్‌‌‌‌ (40వ ని), బెన్‌‌‌‌ హస్బాచ్‌‌‌‌ (48వ ని) జర్మనీకి గోల్స్‌‌‌‌ అందించారు. లీగ్‌‌‌‌, క్వార్టర్స్‌‌‌‌లో సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌ను చూపెట్టిన ఇండియన్‌‌‌‌ ప్లేయర్లు కీలకమైన సెమీస్‌‌‌‌లో మాత్రం ఘోరంగా తేలిపోయారు.

 వచ్చిన అవకాశాలను ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక ఆట, రికార్డుల పరంగా చాలా ఉన్నత స్థానంలో ఉన్న జర్మనీ ఊహించినట్లుగానే ఇండియాపై పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. డిఫెన్స్‌‌‌‌పై వరుసగా దాడులు చేసి గోల్స్‌‌‌‌ చేసే అవకాశాలను సృష్టించుకుంది. దీంతో రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్‌‌‌‌ కొట్టి ఇండియాను ఒత్తిడిలో పడేసింది. చివర్లో అన్మోల్‌‌‌‌ పెనాల్టీ కార్నర్‌‌‌‌ను గోల్‌‌‌‌గా మలిచి ఆధిక్యాన్ని మాత్రం కొద్దిగా తగ్గించాడు. మరో సెమీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ 2–1తో అర్జెంటీనాపై గెలిచి జర్మనీతో టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు రెడీ అయ్యింది.