ప్రజాస్వామ్య సూచీలో పడిపోయిన ఇండియా ర్యాంకు

ప్రజాస్వామ్య సూచీలో పడిపోయిన ఇండియా ర్యాంకు
  • 2019 ప్రజాస్వామ్య సూచీలో 51వ ర్యాంకు
  • గతం కన్నా10 ర్యాంకులు కిందకు
  • ‘ది ఎకనమిస్ట్’ రిపోర్టులో వెల్లడి
  • నార్వే ఫస్ట్‌.. కొరియా లాస్ట్
  • లిస్టులో చివరి 10 దేశాల్లో చైనా

ప్రజాస్వామ్యం లిస్టులో ఇండియా ర్యాంకు తగ్గింది. ఏటేటా పడిపోతోంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ‘ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2019 ప్రజాస్వామ్య సూచీలో 165 దేశాల్లో ఇండియా 51వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే 10 ర్యాంకులు వెనకబడిపోయింది. ఆసియా, ఆస్ట్రేలియా రీజియన్‌లో 8వ ర్యాంకు దక్కింది. మొత్తంగా 2018లో డెమోక్రసీ ఇండెక్స్‌ స్కోరు 7.23 ఉండగా 2019కి అది 6.90కు తగ్గింది. దేశంలో జనానికి స్వేచ్ఛ తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణమని రిపోర్టు వెల్లడించింది. జమ్మూ-కాశ్మీరుకు ప్రత్యేక హోదా రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన, అక్కడ భారీగా బలగాలను మోహరించడం, ఇతర భద్రతా చర్యలు తీసుకోవడం, ఇంటర్నెట్ బంద్‌ వల్ల ఇండియాలో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని నివేదిక పేర్కొంది.

ఆరు కేటగిరీలతో..

దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, ప్లూరలిజం, ప్రభుత్వ పని తీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, ప్రజలకు స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకుని ప్రజాస్వామ్య సూచీని ‘ది ఎకనమిస్ట్‌’ విడుదల చేసింది. వీటి ఆధారంగా స్కోర్‌ను 0 నుంచి 10 వరకు సూచించి ర్యాంకులిచ్చింది. స్కోరు ఆధారంగా దేశాలను 4 రకాలుగా విభజించింది. స్కోరు 8 కన్నా ఎక్కువుంటే పూర్తి ప్రజాస్వామ్య దేశాలని, 6 నుంచి 8 మధ్య ఉంటే తిరోగమన ప్రజాస్వామ్య దేశాలని, 4 నుంచి 6 మధ్య ఉంటే మిశ్రమ ప్రజాస్వామ్య దేశాలని, అంతకు తక్కువుంటే అధికార రాజ్యమని పేర్కొంది.

ఉత్తరకొరియాకు 1.08 స్కోరే

ప్రజాస్వామ్య సూచీలో నార్వే 9.87 స్కోరుతో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ఐస్‌లాండ్‌ రెండు, స్వీడన్‌ మూడో ప్లేస్‌ దక్కించుకున్నాయి. తర్వాత వరుసగా న్యూజిలాండ్‌, ఫిన్‌లాండ్‌, ఐర్లాండ్‌, డెన్మార్క్‌, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌ ఉన్నాయి. ఉత్తర కొరియా 1.08 స్కోరుతో అట్టడుగున నిలిచింది. చైనా చివరి 10 దేశాల్లో నిలిచింది. 153వ ర్యాంకు సాధించింది. గతంతో పోలిస్తే ఆ దేశం స్కోరు 2.26 తగ్గింది. అక్కడ మైనార్టీలపై వివక్ష ఎక్కువైందని, ముఖ్యంగా వాయవ్య ప్రాంతంలోని షింజాంగ్‌లో మరీ ఎక్కువుందని, ప్రజలపై డిజిటల్‌ నిఘా పెరిగిందని, వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గిందని వివరించింది. ఎమర్జింగ్‌ ఎకానమీల్లో బ్రెజిల్‌ 6.86 స్కోరుతో 52వ ప్లేస్‌లో నిలిచింది. రష్యా 3.11 స్కోరుతో 134వ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌ 4.25 స్కోరుతో 108, శ్రీలంక 6.27 స్కోరుతో 69, బంగ్లాదేశ్‌ 5.88 స్కోరుతో 80వ ప్లేస్‌లో నిలిచాయి. థాయ్‌లాండ్‌లో ప్రజాస్వామ్యం మెరుగుపడింది. గతంతో పోలిస్తే1.69 పాయింట్లు పెంచుకొని 6.32 స్కోరుతో 38 స్థానాలు పైకి వెళ్లింది.